జానర్ : క్రైమ్ థ్రిల్లర్
తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో డిస్నీ హాట్ స్టార్ లో
నిడివి: 2.26ని
విడుదల తేదీ: 13, ఆగస్ట్, 2021
నటీనటులు: నయనతార, అజ్మల్ అమీర్, మణికందన్, శరణ్ శక్తి
సాంకేతిక నిపుణులు: కెమెరా: ఆర్.డి. రాజశేఖర్, సంగీతం: గిరీశ్ గోపాలకృష్ణన్, నిర్మాణం: రౌడీ పిక్చర్స్, డైరెక్టర్: మిలింద్ రావు
ఇటీవల కాలంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన సినిమాలకు చక్కని ఆదరణ లభిస్తూ వస్తుంది. దానిని దృష్టిలో పెట్టుకుని నయన్ కీలక పాత్రలో ఆమె కాబోయే భర్త, ప్రియుడు విఘ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ పతాకంపై మిలింద్ రావు దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘నేత్రికన్’. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమాకు కొరియన్ సినిమా ‘బ్లైండ్’ ఆధారం. ఆగస్ట్ 13న ఈ సినిమా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ బాషల్లో హాట్ స్టార్ డిస్నీ ప్లస్ లో అందుబాటులోకి వచ్చింది.
కథ విషయానికి వస్తే.. దుర్గ (నయనతార) ఒక సిబిఐ ఆఫీసర్. రోడ్డు ప్రమాదంలో ఆమె, ఆమె తమ్ముడు ఆదిత్య కంటి చూపును కోల్పోతారు. అయితే ఈ ప్రమాదం నిందితుడైన వ్యక్తి (అజ్మల్ అమీర్) సీరియల్ రేపిస్ట్ అని తెలుస్తుంది. దాంతో ఓ నిజాయితీ పరుడైన పోలీస్ (మణికందన్) సహాయంతో నేరస్థుడిని పట్టుకోవాలనుకుంటుంది. మరి దుర్గ అనుకున్నది సాధించిందా? లేదా? అన్నదే ఈచిత్ర కథాంశం.
నిజానికి ఈ సినిమా 2019లోనే మొదలైంది. చాలా బాగం పూర్తయిన తర్వాత 2020, మార్చిలో లాక్ డౌన్ రావటంతో ఆగిపోయింది. లాక్ డౌన్ తర్వాత మిగిలిన షూటింగ్ పూర్తి చేశారు. అయితే ఈ ఏడాది మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ తో రిలీజ్ ఆగింది. ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేశారు. సినిమా స్లోగా ఆరంభం అయి కథలోకి రావటానికి అరగంట పడుతుంది. నయన్ తార దృష్టిలోపాన్ని రిజిస్టర్ చేసే సన్నివేశాలు అంత పేవలంగా ఉన్నాయి. ఇంటర్వెల్ కి ముందు కథ వేగం పుంజుకుని ఇంటర్వెల్ బ్లాక్ తో పీక్ కి వెళుతుంది. ఆ తర్వాత ఆ స్పీడ్ మెయింటైన్ చేయటంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. తర్వాత ఏం జరుగుతుందన్నది ప్రేక్షకులకు ముందుగానే అర్థం అయిపోతూ ఉంటుంది. క్లయిమాక్స్ సైతం అంతటి థ్రిల్ న కలిగించేలా లేదు. నయనతార ముందు సినిమాలతో పోల్చి చూసుకుంటే చప్పగా అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే నయనతారకు పూర్తి మార్కులు పడతాయి. అంధురాలైన యువతిగా చక్కగా నటించింది. సీరియల్ కిల్లర్ గా అజ్మల్ అమీర్, నిజాయితీగల పోలీస్ గా మణికందన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ క్రైమ్ థిల్లర్ కు గిరీశ్ గోపాకృష్ణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే ఆర్.డి. రాజశేఖర్ కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది.
మంచిపాయింట్ తీసుకున్న దర్శకుడు మిలింద్ రావు దానిని ప్రెజెంట్ చేయటంలో తడబడ్డాడనే చెప్పాలి.
రేటింగ్: 2.25/5
ప్లస్ పాయింట్స్
కథాంశం
నటీనటుల పెర్ఫార్మెన్స్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
ఆకట్టుకోని కథనం
చప్పగా సాగే సన్నివేశాలు
మెప్పించని దర్శకత్వం
ట్యాగ్ లైన్: తెరుచుకోని మూడోకన్ను