NTV Telugu Site icon

రివ్యూ : ఆద్యంతం ఉత్కంఠభరితంగా ”మిడ్ నైట్ మర్డర్స్”

ఈ యేడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘క్రాక్’ మూవీ ఫిబ్రవరి 5న ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ కమర్షియల్ హిట్ మూవీని స్ట్రీమింగ్ చేసిన సందర్భంగా గత శుక్రవారం గ్యాప్ ఇచ్చిన ఆహా ఓటీటీ సంస్థ ఈ ఫ్రై డే మలయాళ చిత్రం ‘అంజామ్ పాతిర’ను తెలుగు వారి ముందుకు తీసుకొచ్చింది. గత యేడాది జనవరి 10న విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కేరళలో ఘన విజయం సాధించింది. దీనిని తెలుగులో వి. రామకృష్ణ ‘మిడ్ నైట్ మర్డర్స్’ అనే పేరుతో డబ్ చేశారు.

కథ విషయానికి వస్తే… అన్వర్ హుస్సేన్ (కుంచాకో బోబన్) ఓ సైకాలజిస్ట్. పోలీసులకు సంబంధించిన కొన్ని కేసులను కూడా పరిష్కరించేందుకు సాయపడుతుంటాడు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో కన్సల్టెంట్ సైకాలజిస్ట్ గా చోటు సంపాదించాలన్నది అతని కోరిక. అతని భార్య ఫాతిమా (రమ్యా నంబీశన్). ఓ రోజున ఏసీపీ అనిల్ మాధవన్ (జీను జోసెఫ్) కోరిన మీదట డీఎస్పీ అభిమాన్యు కౌశిక్ హత్య కేసును విచారించే టీమ్ లో ఇతనూ చేరతాడు. అక్కడ నుండి ఆగకుండా మరో రెండు, మూడు హత్యలు జరుగుతాయి. సీరియల్ కిల్లర్ పోలీస్ అధికారులనే టార్గెట్ చేసి, అతి కిరాతకంగా హత్యలు చేస్తుంటాడు. దీనిని అన్వర్ హుస్సేన్ సాయంతో పోలీసులు ఎలా ఛేదించారన్నదే ఈ ‘మిడ్ నైట్ మర్డర్స్’ కథాంశం. 

ఈ మధ్య ఇలాంటి మర్డర్ మిస్టరీ చిత్రాలు తెలుగులో కాస్తంత వస్తున్నాయి. కానీ మలయాళంలో ఎంతో కాలంగా ఈ తరహా చిత్రాలు తీస్తున్నారు. అయితే… అక్కడి ప్రేక్షకులు ఇప్పటికీ ఈ జానర్ చిత్రాలను ఆదరిస్తుండటం విశేషం. టెంపో తగ్గకుండా దర్శకుడు సినిమా తీయాలే కానీ ఆదరించే ప్రేక్షకులు బాగానే ఉన్నారు. ఇలాంటి చిత్రాలు థియేటర్లలో విడుదలైతే తెలుగు వారు ఓపిక చూడటం కష్టం. కానీ… ఓటీటీ కారణంగా ఇలాంటి భిన్నమైన కథాంశాలు మన ముందుకు వస్తున్నాయి. వీకెండ్ లో ఇలాంటి వాటిని చూడటం కోసం ఓ రెండు గంటలు వెచ్చించడానికి మనవాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడరనిపిస్తోంది. ఆ రకంగా ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను పరభాషల నుండి తెలుగు వారి ముందుకు తీసుకొస్తున్న ఆహా సంస్థను అభినందించాలి.

నిజానికి ఈ సినిమా బేసిక్ లైన్ లో పెద్దంత కొత్తదనంలేదు. పోలీస్ డిపార్ట్ మెంట్ వల్ల తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఓ యువకుడు ఎలా  పగ తీర్చుకున్నాడన్నదే మెయిన్ థీమ్. ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. కానీ ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య, అలానే పరిష్కారమూ ఒక్కో రకంగా ఉంటూ ఉంటుంది. దానిని ఆసక్తి కరంగా తెరకెక్కించడమే దర్శకుడు చేయాల్సిన పని. ఈ రివేంజ్ డ్రామాను డైరెక్టర్ తెరకెక్కించిన విధానం కొత్తగా ఉంది. సీరియల్ కిల్లర్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందనే విషయాన్ని ఉరిశిక్ష పడిన ఖైదీ ఫంక్ రవి ద్వారా చెప్పించడం, ఎప్పటికప్పుడు పోలీసులను తప్పుదారి పట్టిస్తూ, నిందితుడు తెలివిగా ప్రవర్తించడం, తన తెలివితేటలతో సైబర్ క్రైమ్ కు పాల్పడటం ఆసక్తిని కలిగించే అంశాలు. అమాయకులైన మహిళలపై చర్చిలో జరుగుతున్న అత్యాచారాలను ధైర్యంగా ఈ సినిమాలో చూపించారు. చర్చి ఫాదర్ నీచమైన చర్యకు పాల్పడిన కారణంగా ఓ కుటుంబం ఎలా బలైపోయిందో తెలిపారు. ఇలాంటి సన్నివేశాలు మన తెలుగు సినిమాలలో తక్కువగా కనిపిస్తాయి. హ్యాకర్ గా శ్రీనాథ్ బాషీ, డా. బెంజిమిన్ లూయిస్ గా షరాఫుద్దీన్, డీసీపీ కాథరిన్ గా ఉన్నిమాయా ప్రసాద్ సహజమైన నటన ప్రదర్శించారు. 

నేరం చేసిన వ్యక్తి ఎక్కడో చోట దొరికిపోతాడని చూపడంతో పాటు, పోలీస్ అధికారి అయినా తప్పు చేస్తే… చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని కూడా ప్రతీకారం తీర్చుకునే వాళ్ళూ ఉంటారని దర్శకుడు మిధున్ మాన్యుల్ థామస్ పతాక సన్నివేశంలో తెలిపాడు. థ్రిల్లర్ జానర్ ను ఇష్టపడే వారికి ‘మిడ్ నైట్ మర్డర్స్’ నచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్

నటీనటుల నటన
ఆసక్తి కలిగించే స్క్రీన్ ప్లే
షైజూ ఖలీద్ సినిమాటోగ్రఫీ
మిధున్ దర్శకత్వ ప్రతిభ

మైనెస్ పాయింట్స్

రొటీన్ రివేంజ్ స్టోరీ

రేటింగ్
2.25 / 5

ట్యాగ్ లైన్

ఆద్యంతం ఉత్కంఠభరితం!

Show comments