ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల ఆదరణ చూరగొన్న ఒక సేవను నిలిపి వేయనున్నట్లు సమాచారం. ‘ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేస్తాం’ అంటూ 2022 మార్చిలో జొమాటో ఇన్‌స్టంట్ ఓ ప్రకటన చేసింది. ఇప్పుడీ సేవల్ని నిలిపివేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రెస్టారెంట్ పార్ట్‌నర్స్‌కు కంపెనీ ఇటీవల సమాచారమిచ్చిందట. కఠిన మార్కెట్ పరిస్థితుల్ని తట్టుకుని, లాభాల్ని పెంచుకునే ఉద్దేశ్యంతో జొమాటో ఈ సేవలను ప్రారంభించింది. అయితే ఈ సర్వీస్‌తో లాభాలు పెరగకపోగా, స్థిర వ్యయాలు చెల్లించేందుకు అవసరమైన పరిమాణంలో రోజువారీ ఆర్డర్లు కూడా లభించడం లేదని తెలుస్తోంది. అందువల్లే ఈ సేవలు నిలిపివేసి, ఆ స్థానంలో మరో కొత్త సర్వీస్‌ను వారం, పది రోజుల్లో ప్రవేశ పెట్టనున్నట్లు చెబుతున్నారు. తక్కువ విలువ కలిగిన ప్యాక్డ్ మీల్స్ (థాలి, కాంబో మీల్స్) వంటి వాటిని సరఫరా చేసేందుకు సంస్థ ప్రయోగాత్మకంగా అడుగులు వేసే అవకాశం ఉంది. అయితే జొమాటో దీనిపై స్పందించింది. ఇన్‌స్టంట్ సేవలు నిలిపివేయడం లేదని, కేవలం రీబ్రాండింగ్ చేస్తున్నామని స్పష్టం చేసింది.
ఇటీవలే బయటపడ్డ జొమాటో స్కామ్
తాజాగా జొమాటో ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఓ స్కామ్ హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఎంట్రప్రెన్యూర్ వినయ్ సతి కొద్దిరోజుల క్రితం జొమాటోలో బర్గర్స్ ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టిన 30 నిమిషాల తర్వాత బర్గర్స్ తెచ్చిన ఆ డెలివరీ బాయ్.. వినయ్‌తో.. “సార్ నెక్ట్స్ టైం నుంచి మీరు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయకండి. క్యాష్ ఆన్ డెలివరీ చేయండి. మీరు 700-800 రూపాయిలు విలువ చేసే ఫుడ్ ఆర్డర్ పెట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోండి. కానీ మీరు నాకు 200 రూ. మాత్రమే చెల్లించండి. మీరు ఆర్డర్‌ను తీసుకోలేదని నేను జొమాటో వాళ్లతో చెబుతా. కానీ మీరు మీ ఫుడ్ ఎంజాయ్ చేయండి. 200-300రూ. కట్టి 1000రూ. ఫుడ్ తినండి..” అంటూ చెప్పాడు. అది విని ఖంగుతున్న వినయ్.. ఈ ఉదంతాన్ని లింక్‌డిన్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో…జొమాటోలోని డెలివరీ బాయ్స్ భారీగా మోసం చేస్తున్నారని, ఎలా మోసం చేయాలో సలహా ఇచ్చారని, జొమాటోలో స్కామ్ జరుగుతోందని విని నాకు గూస్‌బంప్స్ వచ్చాయని పేర్కొన్నారు. ఇక, జొమాటో డెలివరీ బాయ్ చెప్పినట్లు ఆఫర్‌ను ఎంజాయ్ చేయాలా? లేదంటే మోసాన్ని బహిర్గతం చేయాలా? అని ప్రశ్నించారు.నేను ఎంట్రప్రెన్యూర్‌ను కాబట్టి సెకండ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకున్నానని.. అందుకే మీ ముందుకు వచ్చానంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. కాగా.. ఆ పోస్ట్‌పై జొమాటో సీఈవో గోయల్ స్పందించారు. కంపెనీలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. అంటే ఇదంతా సీఈఓ లాంటి పై అధికారులకు తెలిసే జరుగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.