Site icon NTV Telugu

US Tariff: భారత్‌పై ట్రంప్ చేసిన 9 అసత్య ఆరోపణలు ఇవే.. మొత్తం అబద్ధాలే..!

Donald Trump

Donald Trump

9 Lies Donald Trump Told About India- Russa: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అనేక విమర్శలు గుప్పించారు. భారత్ రష్యాకు ఆర్థికంగా సహాయం చేస్తోందని అన్నారు. రష్యన్ చమురు కొనుగోలుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అదనపు టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. నిన్న 50% టారిఫ్ విధిస్తూ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. రష్యా నుంచి భారత్‌కు పెరుగుతున్న చమురు దిగుమతులు ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయని ట్రంప్, పాశ్చాత్య మీడియా పేర్కొంటున్నాయి. కానీ వాస్తవం వేరేలా ఉంది. ఇది ఈ వాదనలు ఎంత అబద్ధాలు.. ట్రంప్ భారత్‌పై చేసిన 9 అబద్ధాల గురించి తెలుసుకుందాం.

1. రష్యన్ చమురు దిగుమతిపై నిషేధం ఉందా..?
రష్యా నుంచి చమురు తీసుకోవద్దని పశ్చిమ దేశాల నిర్ణయించాయి. కానీ.. ఇరానియన్ లేదా వెనిజులా చమురులా కాకుండా.. రష్యన్ చమురుపై పూర్తి నిషేధం లేదు. బదులుగా రష్య చమురుపై G7, యూరోపియన్ యూనియన్ ‘ధర పరిమితి’ వ్యవస్థను అమలు చేశాయి. రష్యన్ చమురు ప్రపంచ సరఫరాలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి అనుమతి ఉంది. భారతదేశం ఈ పరిమితికి మించి చమురును ఎప్పుడూ కొనుగోలు చేయలేదు. భారత్‌ కొనుగోలు చేసే చమురు G7 నిర్ణయించిన పరిమితి కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంది. ఇది చట్టబద్ధమైన, పారదర్శక లావాదేవీ.

2. భారతదేశంపై ఎందుకు కోపం?
భారత్ పరిమితుల్లో వ్యాపారం చేస్తోంది.. కానీ ప్రపంచ స్థాయిలో ఇంత పెద్ద కపటత్వం ఎందుకు..? లేనిది ఉన్నట్లుగా ఎందుకు కల్పిస్తున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమువుతున్నాయి. వాస్తవానికి, ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న దేశాలు భారత్‌ను ఇష్టపడవు. ఎందుకంటే.. భారత్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుందని భయం. అందుకే ఇతర దేశాలు నిశ్శబ్దంగా రష్యాతో వ్యాపారం చేస్తున్నప్పటికీ.. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న భారత్‌ను మాత్రమే నిందిస్తున్నారు. ఇది నైతికతకు సంబంధించిన విషయం కాదని.. రాజకీయంగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

3. రష్యన్ ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేసేవారు ఎవరు..?
డిసెంబర్ 2022, జూలై 2025 మధ్య రష్యన్ చమురును చైనా (47%), భారతదేశం (38%), EU దేశాలు + టర్కీ (6%) చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. చైనా అత్యధికంగా కొనుగోలు చేస్తోంది. భారత్ మాత్రమే అత్యధికంగా కొనుగోలు చేస్తోందనే ట్రంప్ వాదన పూర్తిగా తప్పు.

4. రష్యా సహజ వాయువును భారతదేశం ఎక్కువగా కొనుగోలు చేస్తుందా?

రష్యా సహజ వాయువును భారత్ ఎక్కువగా కొనుగోలు చేస్తుందనే అమెరికా వాదన పూర్తిగా తప్పు.. ఎందుకంటే భారత్ రష్యాకు దగ్గరగా లేదు. భారత్ చమురు దిగుమతులను విమర్శించే ఐక్యరాజ్యసమితి, రష్యన్ గ్యాస్ కొనుగోలులో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఒక్క జూన్ 2025లోనే EU దేశాలు రష్యన్ గ్యాస్ కోసం $1.2 బిలియన్లకు పైగా చెల్లించాయి. అగ్ర కొనుగోలుదారులలో ఫ్రాన్స్, హంగేరీ, నెదర్లాండ్స్, స్లోవేకియా ఉన్నాయి.

5. శుద్ధి చేసిన పెట్రో ఉత్పత్తులు..
భారత్ రష్యన్ శుద్ధి చేసిన ఇంధనాన్ని కొనుగోలు చేయదు. కానీ ఇతర దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. నాటో సభ్యదేశమైన టర్కీ రష్యా నుంచి 26 శాతం శుద్ధి చేసిన చమురును కొనుగోలు చేస్తుంది. చైనా, బ్రెజిల్ కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యాకు ఎవరు సహకరిస్తున్నట్లు..!

6. భారత్ ప్రపంచ నియమాలను లేదా ఆంక్షలను ఉల్లంఘిస్తుందా..?
భారత్‌ ఎలాంటి ఆంక్షలను ఉల్లఘించడం లేదు. భారత్ రష్యన్ ప్రభుత్వ సంస్థల నుంచి కాకుండా అంతర్జాతీయ వ్యాపారుల ద్వారా చమురును కొనుగోలు చేస్తుంది. G7 నిర్ణయించిన ధర పరిమితి నియమాల ప్రకారం మాత్రమే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. అన్ని ప్రమాణాలను తు. చ. తప్పకుండా అనుసరిస్తుంది. ప్రతి లావాదేవీ చట్టబద్ధంగానే ఉంది.

7. భారత్ రష్యన్ చమురు కొనుగోలును ఆపివేస్తే ఏమి జరుగుతుంది?
రష్యా చమురు మార్కెట్ల నుంచి భారత్ అకస్మాత్తుగా వైదొలగడం వల్ల ప్రపంచ స్థాయిలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $200 కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద ముప్పుగా మారుతుందని చెబుతున్నారు. భారత్ రష్యన్ చమురు కొనుగోలు చేయడం వల్ల ధరలు స్థిరంగా ఉన్నాయని.. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు నివారించబడిందని చెబుతున్నారు.

8. భారత్ తన సొంత ప్రయోజనం కోసమే చేస్తుందా..?
ఇది ముమ్మాటికీ తప్పుడు వాదన.. రష్యన్ చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ ప్రపంచ మార్కెట్లకు స్థిరత్వాన్ని తెచ్చిపెట్టింది. దీనిని అమెరికా అధికారులు కూడా అంగీకరించారు. భారతదేశం చమురు కొనుగోలును కొనసాగిస్తుండటంతో సంతోషంగా ఉన్నామని అమెరికా ఆర్థిక మంత్రి (నవంబర్ 2022) తన ప్రకటనలో తెలిపారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వంలో ఇంధన సలహాదారు (2024) సైతం భారత్ ప్రపంచ మార్కెట్లను స్థిరీకరించడంలో సహాయపడిందని చెప్పారు. అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి (మే 2024) సైతం గతంలో భారత్‌ను మెచ్చుకున్నారు. ఈ ప్రకటనల ద్వారా భారత్‌ లాభం కోసం మాత్రమే ఇలా చేస్తుంటే.. ఇంత మంది ఎందుకు మెచ్చుకుంటారు..? అమెరికా దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది.

9. పశ్చిమ దేశాల ద్వంద్వ ప్రమాణాలు?
ఈయూ ఇప్పటికీ హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్‌లకు పైపులైన్ల ద్వారా రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఉత్తర శుద్ధి కర్మాగారాలకు రష్యన్ చమురు దిగుమతిని కొనసాగించడానికి జపాన్‌కు 2026 వరకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వబడింది. ఈయూ 18వ ఆంక్షల ప్యాకేజీలో బ్రిటన్, కెనడా, నార్వే, స్విట్జర్లాండ్, యూఎస్‌లకు కూడా మినహాయింపు ఉంటుంది. రష్యా చమురుకు సంబంధించి భారతదేశంపై చేస్తున్న వాదనలు ఎంత అబద్ధమో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Exit mobile version