NTV Telugu Site icon

Special Story On Cyrus Mistry: ‘టాటా’తో పోరాడారు.. విధి చేతిలో ఓడారు.. సైరస్ మిస్త్రీపై ప్రత్యేక కథనం

Special Story On Cyrus Mistry

Special Story On Cyrus Mistry

Special Story On Cyrus Mistry: సైరస్‌ మిస్త్రీ భారతీయ వ్యాపారవేత్తల్లో ఒక ప్రముఖుడు. ఆయన ప్రతిష్టాత్మక టాటా సంస్థకు 6వ చైర్మన్‌గా వ్యవహరించారు. ముక్కుసూటి మనిషి. నిజాయితీకి, నిరాడంబరత్వానికి నిదర్శనంగా ఉండేవారు. టాటా గ్రూపు నుంచి వైదొలిగాక ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. కొవిడ్‌ సమయంలో అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఆయన పెట్టుబడులు ఎక్కువ శాతం రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లోనే ఉండటం వల్ల మరియు షేర్‌ హోల్డింగులు టాటా గ్రూపు ఆధీనంలోనే ఉండిపోవటంతో చాలా కష్టాలు అనుభవించారు.

2012లో టాటా గ్రూప్ చైర్మన్‌ రతన్‌ టాటా రిటైర్‌ అవుతుండటంతో ఆయన స్థానంలో సైరస్‌ మిస్త్రీని నియమించారు. 2016లో ఆ పదవి నుంచి టాటా సన్స్‌ తొలగించింది. మొత్తం 9 మంది బోర్డు సభ్యుల్లో ఏకంగా ఏడుగురు ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. మిగతా ఇద్దరిలో సైరస్‌ మిస్త్రీని మినహాయిస్తే మిగిలిన ఒకరు ఆయన తొలగింపు విషయంలో న్యూట్రల్‌గా వ్యవహరించారు. వీళ్ల మధ్య అప్పుడు మొదలైన వివాదాలు కొన్నేళ్లపాటు కొనసాగాయి. 1960లో మిస్త్రీ కుటుంబం జేఆర్‌డీ టాటా బ్రదర్స్‌లో 18 శాతం వాటాలను కొనుగోలు చేసింది. టాటా సన్స్‌లో మెజారిటీ ఇండివిడ్యువల్‌ షేర్‌ హోల్డర్‌ అయిన టాటా ఛారిటబుల్‌ ట్రస్టుకు 66 శాతం ఓనర్‌షిప్‌ ఉంది. 2016లో టాటా పవర్‌కి, వెల్‌స్పెన్‌ రెనివబుల్‌ ఎనర్జీ కంపెనీకి మధ్య రూ.9,249 కోట్ల విలువైన అక్విజిషన్‌ డీల్‌ కుదిరింది.

కానీ ఈ డీల్‌ గురించి బోర్డు దృష్టికి తీసుకురాలేదు. పైగా అప్పటికే నష్టాల్లో ఉన్న టాటా పవర్‌ ఈ ఒప్పందం కుదుర్చుకోవటం ఒక ముఖ్యమైన విషయం. అలాంటి ఓ డీల్‌ గురించి బోర్డు దృష్టికి తీసుకురాకపోవటం కూడా ఆయన తొలగింపునకు దారితీసింది. టాటా టెలీ సర్వీసెస్‌ మరియు డొకోమో మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అందులోభాగంగా డొకోమో.. టాటా టెలీ సర్వీసెస్‌లో 2.7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడికి ప్రతిఫలంగా టాటా టెలీ సర్వీసెస్‌.. డొకోమోలో 26.5 శాతం స్టేక్‌ని కొనుగోలు చేసింది. ఈ డీల్‌ గనక లక్ష్యాలను చేరుకుంటే ఐదేళ్ల తర్వాత ఈ వాటాను 51 శాతానికి పెంచాలని షరతు విధించారు. ఒకవేళ టార్గెట్‌ను చేరుకోలేకపోతే వాటాను కొనుగోలు చేసే సంస్థను కూడా టాటావాళ్లే తీసుకురావాలని, లేకపోతే వాళ్లే సగం రేటుకు కొనాలనేది ఈ డీల్‌లోని కండిషన్‌.

అయితే.. ఈ లక్ష్యాలను చేరుకోలేకపోవటం వల్ల పైన చెప్పుకున్న రెండు షరతులకు టాటా టెలీ సర్వీసెస్‌ కట్టుబడాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఆర్‌బీఐ రూల్స్‌ మారాయి. టాటా టెలీ సర్వీసెస్‌కి, డొకోమోకి మధ్య ఉన్న ఎంటిటీ డాక్యుమెంట్‌ ప్రకారం కొనుగోలు ధర మార్కెట్‌ ఫేర్‌ కంటే ఎక్కువ ఉంటే అది కొనుగోలు చేయొద్దని ఆర్బీఐ సూచించింది. అప్పుడు టాటా టెలీ సర్వీసెస్‌.. ప్రైస్‌ వాటర్‌ కూపర్‌ నుంచి వ్యాల్యుయేషన్‌ తీసుకుంది. ఈ వ్యాల్యుయేషన్‌ సంస్థ డిస్కౌంటెడ్‌ క్యాష్‌ ఫ్లో మెథడ్‌ ప్రకారం నిర్ణయించిన ధరని డొకోమో అంగీకరించలేదు. దీనిపై ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టును ఆశ్రయించి విజయం సాధించింది. డీల్‌ అమౌంట్‌ కోసం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి టాటా నుంచి 1.27 బిలియన్‌ డాలర్లు రాబట్టింది.

నైతికతకు, విలువలకు మారుపేరుగా నిలిచిన టాటా గ్రూపు ఇలా కోర్టుల్లో నిలవటం వల్ల ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఇమేజ్‌ కోల్పోతుందని రతన్‌ టాటా భావించారు. విషయం కోర్టుల వరకు వెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించటంలో సైరస్‌ మిస్త్రీ విఫలమయ్యారని బోర్డు మెంబర్లు ఒక నిర్ణయానికి రావటం కూడా ఆయన తొలగింపునకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. సైరస్‌ మిస్త్రీ టాటా గ్రూప్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేటప్పుడు ఆ సంస్థ కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ అనే ఒక కండిషన్‌ పెట్టింది. చైర్మన్‌గా ఉన్న సమయంలో టాటా గ్రూపు ప్రయోజనాలపై సైరస్‌ మిస్త్రీ కుటుంబ సంస్థ అయిన షాపూర్‌జీ పల్లోంజీ వల్ల విరుద్ధ ప్రభావం పడకూడదన్నదే ఈ షరతు ఉద్దేశం.

కానీ ఆయన ఈ ఉద్దేశాలను ఉల్లంఘించి టాటా గ్రూపు కాంట్రాక్టులను తన ఫ్యామిలీ కంపెనీకి కట్టబెట్టారనేది ప్రధాన ఆరోపణ. తనపై వచ్చిన ఈ ఆరోపణలను సైరస్‌ మిస్త్రీ ఖండించారు. టాటా గ్రూపులోని మెజారిటీ షేర్లు కలిగిన టాటా సన్స్‌ ఆధిపత్యం చెలాయించేవారని, మైనారిటీ షేర్‌ హోల్డర్ల అభిప్రాయాలకు విలువ ఇచ్చేవారు కాదని సైరస్‌ మిస్త్రీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఒకటి 2018లో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకొచ్చింది. అనంతరం.. ఆయనకే చెందిన మరో సంస్థ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ని ఆశ్రయించింది. దీంతో సైరస్‌ మిస్త్రీని నాలుగు వారాల్లోగా చైర్మన్‌గా పునర్నియమించాలని NCLAT టాటా గ్రూప్‌ని ఆదేశించింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన టాటా గ్రూపు అనుకూల తీర్పుతో ఊరట పొందింది.

అనంతరం.. టాటా గ్రూపులోని సైరస్‌ మిస్త్రీ షేర్ల అమ్మకానికి సంబంధించిన ఇష్యూ తలెత్తింది. తన 18 శాతం వాటాలకు 1.75 లక్షల కోట్లు రావాలని సైరస్‌ మిస్త్రీ కోరగా టాటా గ్రూప్‌ మాత్రం 70-80 వేల కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పింది. ఈ వివాదాన్ని ఔట్‌ ఆఫ్‌ ది కోర్టు పరిష్కరించుకోవాలంటూ అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ వివాదాలన్నింటి నుంచి బయటపడే లోపే ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ‘టాటా’తో శక్తిమేరకు పోరాడిన సైరస్ మిస్త్రీ విధి చేతిలో ఓడిపోవటం బాధాకరం. అయితే.. ఈ కార్‌ యాక్సిడెంట్‌పైన కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతుండటం చర్చనీయాంశంగా మారింది.