Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..

Radico Khaitan

Radico Khaitan

Radico Khaitan: మత్తులో మునిగే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది కానీ తరగడం లేదు. నిజానికి అత్యధిక మద్యం వినియోగం ఉన్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి. దీని ఫలితంగా ఈ మద్యం కంపెనీలకు పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయి. ఈ స్టోరీలో అలాంటి ఒక కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. భారతదేశంలో తయారైన అతిపెద్ద విదేశీ మద్యం కంపెనీలలో ఒకటైన రాడికో ఖైతాన్ లిమిటెడ్ లాభాలు.. గత 90 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగిసిన త్రైమాసికంలో రాడికో ఖైతాన్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం రెట్టింపు అయి రూ.179.46 కోట్లకు చేరింది. ఈ లాభాల విషయాన్ని కంపెనీ బీఎస్ఈకి పంపిన ఒక ప్రకటనలో వెల్లడించింది.

రెట్టింపు లాభం సొంతం చేసుకున్న కంపెనీ..
గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.93.07 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ కంపెనీ రాంపూర్ ఇండియన్ సింగిల్ మాల్ట్ విస్కీ, జైసల్మేర్ ఇండియన్ క్రాఫ్ట్ జిన్, మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, 8 PM వంటి బ్రాండ్‌లను కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.4,485.42 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆదాయం, ఈ త్రైమాసికంలో 15.5 శాతం పెరిగి రూ.5,180.23 కోట్లకు చేరింది. మార్చి త్రైమాసికంలో రాడికో ఖైతాన్ యొక్క మొత్తం IMFL (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) అమ్మకాలు 4 శాతం పెరిగి 9.52 మిలియన్ కేసులకు (12 750 ml బాటిళ్లు) చేరుకున్నాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఖర్చులు 13.5 శాతం పెరిగి రూ.4,955.40 కోట్లకు చేరాయి. ఇతర ఆదాయంతో సహా కంపెనీ మొత్తం రాబడి 15.63 శాతం పెరిగి రూ.5,188.12 కోట్లకు చేరింది. 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రాడికో ఖైతాన్ నికర లాభం 75 శాతం పెరిగి రూ.604.47 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకీకృత మొత్తం ఆదాయం 22.7 శాతం పెరిగి రూ.20,988.23 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఒక ప్రత్యేక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో 2025-26 సంవత్సరానికి గాను రూ.2 విలువ గల ప్రతి ఈక్విటీ షేరుకు రూ.9 చొప్పున తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసినట్లు రాడికో ఖైతాన్ తెలిపింది.