RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?

Rbi Fd

Rbi Fd

RBI New FD Rules: ఇవాళ్టి పొదుపే.. రేపు మీకు తోడుగా ఉంటుంది.. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది.. దాని కోసం డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడిగా పెడుతుంటారు.. చాలా మంది రిస్క్‌ ఫ్యాక్టర్‌ లేని ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) పెడుతుంటారు.. అయితే, FDలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు ప్రధానంగా బల్క్ డిపాజిట్లకు సంబంధించినవి. ప్రస్తుతం షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో రూ.3 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బల్క్ డిపాజిట్‌గా పరిగణిస్తున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం బల్క్ డిపాజిట్లపై బ్యాంకులు తమ అవసరాలు, లిక్విడిటీ పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరు వడ్డీ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR) ఫ్రేమ్‌వర్క్, అన్‌సెక్యూర్డ్ బల్క్ డిపాజిట్లకు వర్తించే రన్‌ఆఫ్ రేట్లను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రేట్లను నిర్ణయించే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన మార్పు వడ్డీ రేట్ల పారదర్శకతకు సంబంధించినది. బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, ముఖ్యంగా బల్క్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేట్లను తమ వెబ్‌సైట్లలో స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. బల్క్ డిపాజిట్లకు సంబంధించిన రేట్లను ప్రతి పనిదినం ఉదయం నిర్ణీత సమయానికి అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అదే తేదీన, ఒకే మొత్తానికి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకు శాఖల మధ్య వివక్ష లేకుండా ఒకే రకమైన వడ్డీ రేట్లు వర్తించేలా నిబంధనలు రూపొందించారు. అంటే ఒకే రకమైన డిపాజిట్‌ను ఒకే తేదీన స్వీకరించినప్పుడు శాఖల ఆధారంగా వేర్వేరు వడ్డీ రేట్లు ఉండకూడదు.

అయితే ఈ మార్పులు ప్రధానంగా రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలోని బల్క్ డిపాజిట్లకు సంబంధించినవి కావడంతో సాధారణంగా చిన్న మొత్తాలతో FDలు చేసే రిటైల్ పెట్టుబడిదారులపై ప్రత్యక్ష ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. అదే, సమయంలో వడ్డీ రేట్ల వివరాలను బ్యాంకులు మరింత పారదర్శకంగా వెల్లడించాల్సి రావడం ఖాతాదారులకు ఉపయోగపడనుంది. కాగా, FDలు స్థిరమైన రాబడి కోసం ఎంచుకునే ప్రముఖ పెట్టుబడి సాధనాల్లో ఒకటి. అయితే అన్ని బ్యాంకులు ఒకే వడ్డీ రేటును అందించవు. డిపాజిట్ మొత్తం, కాలపరిమితి, బ్యాంకు నిబంధనలు వంటి అంశాల ఆధారంగా రేట్లు మారవచ్చు. సీనియర్ సిటిజన్లకు కొన్ని బ్యాంకులు సాధారణ ఖాతాదారుల కంటే అదనపు వడ్డీని అందిస్తున్నాయి. కాబట్టి FD చేయడానికి ముందు సంబంధిత బ్యాంకు తాజా వడ్డీ రేట్లు, కాలపరిమితి, ముందస్తు ఉపసంహరణ నిబంధనలను పరిశీలించడం ఎంతైనా అవసరం..