Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు

  • పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెంపు
  • నయారా ఎనర్జీ ప్రకటన
Petrol

Petrol

Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్. ప్రైవేట్ ఫ్యూయల్ రిటైలర్ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలను పెంచింది. ఈ కొత్త ధరలు శనివారం తెల్లవారుజాము నుంచే తక్షణం అమల్లోకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీకి 7,108 పెట్రోల్ బంకులు ఉన్నాయి.

ఈ అన్ని రిటైల్ అవుట్‌లెట్లలో ధరల సవరణ అమల్లోకి వచ్చినట్లు సమాచారం. అంతర్జాతీయంగా ముడిచమురు, రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడంతో ఫ్యూయల్ రిటైలర్లపై ఖర్చుల ఒత్తిడి పెరిగిందని నివేదికలు పేర్కొంటున్నాయి. నయారా ఎనర్జీ అధికార ప్రతినిధి నుంచి ఈ ధరల పెంపుపై వ్యాఖ్యలు కోరినప్పటికీ, తాజా నివేదికలు వెలువడే సమయానికి స్పందన రాలేదని వార్తా సంస్థలు తెలిపాయి.

మార్చిలోనూ పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు

ఈ ఏడాది మార్చి 26న కూడా నయారా ఎనర్జీ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలు పెంచింది. ఆ సమయంలో నయారా బంకుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.100.71, డీజిల్ ధర రూ.91.31గా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కూడా మే నెలలో దశలవారీగా ధరలను పెంచాయి. మే చివరి నాటికి వాటి పెంపు మొత్తం సుమారు రూ.7.50 వరకు చేరినట్లు PTI నివేదిక పేర్కొంది. మే 25న జరిగిన నాలుగో పెంపులో పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 చొప్పున పెంచారు.

జూలైలో ధరలు తగ్గించిన నయారా

అయితే అంతర్జాతీయ ముడిచమురు ధరలు తగ్గడంతో నయారా ఎనర్జీ జూలై 1న తన మార్చి పెంపును వెనక్కి తీసుకుంది. పెట్రోల్ ధరను రూ.5, డీజిల్ ధరను రూ.3 చొప్పున తగ్గించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ క్రూడ్ ధరలు కొంత సడలిన నేపథ్యంలో ఈ తగ్గింపు జరిగింది. తాజా పెంపుతో నయారా మరోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ఇంధన వ్యయాల ప్రభావాన్ని రిటైల్ ధరల్లోకి బదిలీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ చమురు ధరల ప్రభావం

ఇటీవల అంతర్జాతీయ ఇంధన ధరలు పెరగడం, క్రూడ్, రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల ఖర్చులు అధికం కావడం ఫ్యూయల్ రిటైలర్లపై ఒత్తిడిని పెంచింది. భారత్‌లో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడంతో వాటి మార్జిన్లపై కూడా ఒత్తిడి పెరిగినట్లు పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా, అక్టోబర్ 1న ప్రైవేట్ ఫ్యూయల్ రిటైలర్లు పెట్రోల్, డీజిల్ విక్రయాలను పరిమితం చేయడం ఆమోదయోగ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నయారా, జియో-బీపీ వంటి సంస్థలు పెరిగిన వ్యయాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విక్రయ పరిమితులు విధించినట్లు రిపోర్టులు వచ్చాయి.