Funeral Pre-Booking: ఇదేం వింత బిజినెస్ భయ్యా.. సొంత అంత్యక్రియలకు ముందే అడ్వాన్స్ బుకింగ్!

Funeral Pre Booking Business

Funeral Pre Booking Business

Funeral Pre-Booking: సినిమా టికెట్లకో, ఫ్లైట్ జర్నీకో, హోటల్ రూమ్స్‌కో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మనకు తెలుసు. కానీ, మనిషి బతికుండగానే సొంత అంత్యక్రియల కోసం ముందే ప్యాకేజీ బుక్ చేసుకోవడం ఎప్పుడైనా విన్నారా? వినడానికి వింతగా ఉన్నా, ఢిల్లీకి చెందిన ఒక స్టార్టప్ సంస్థ సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో మార్కెట్లోకి వచ్చింది. సాధారణంగా చావు అనే ఆలోచనకే భయపడిపోయే జనం మధ్య.. ఆ మరణాన్నే ఒక బిజినెస్ మోడల్‌గా మార్చేసింది. ఢిల్లీలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF)లో ‘మోక్ష వాయేజ్’ (Moksha Voyage) అనే సంస్థ ఈ కొత్త తరహా సేవలను పరిచయం చేయడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది.

నమో గంగే వెల్నెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కంపెనీ, ఎవరి బడ్జెట్, అవసరాలకు తగ్గట్లు వాళ్లు ముందుగానే అంత్యక్రియల ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందులో రూ.6,000 ప్రారంభ ధర నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు రకరకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి ప్యాకేజీ బుక్ చేసుకుంటే చాలు.. అంత్యక్రియల ప్లానింగ్ మొదలుకొని మృతదేహాన్ని తరలించే వాహనం, పాడె మోసేవాళ్లు, దహన సంస్కారాలు, ఆ తర్వాత చేసే కర్మకాండల వరకు అన్నీ కంపెనీయే దగ్గరుండి చూసుకుంటుంది. అంతేకాదు, ఎవరైనా విదేశాల్లో చనిపోతే వాళ్ల పార్థివ దేహాన్ని ఇండియాకు తీసుకొచ్చే ఏర్పాట్లను కూడా ఈ ప్యాకేజీలలో యాడ్ చేసుకోవచ్చు.

నిజానికి మనకు ఇది వింత బిజినెస్‌లా అనిపించొచ్చు కానీ, అమెరికా లాంటి దేశాల్లో ఇది వేల కోట్ల వ్యాపారం. అక్కడ అంత్యక్రియల పరిశ్రమ విలువ ఏటా సుమారు 20.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 75 శాతం వాటా చిన్న కుటుంబ వ్యాపారాలదే కాగా, సర్వీస్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్ (SCI) అనే ఒక్క కంపెనీయే 17 శాతం మార్కెట్‌ను శాసిస్తోంది. 2019లో 12 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆ సంస్థ ప్రీ-బుకింగ్ ప్యాకేజీల విలువ ఏకంగా 18 బిలియన్ డాలర్లకు చేరిందంటేనే దీనికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా త్రైమాసికంలో ఆ సంస్థ నిర్వహించిన అంత్యక్రియల సంఖ్య 1 శాతం తగ్గినప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్ అమ్మకాలు మాత్రం 7 శాతం పెరగడం విశేషం. అమెరికాలో దహన సంస్కారాలు, అంత్యక్రియలకు సంబంధించిన సేవల మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. 2008లో సుమారు 1 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ వ్యాపారం, ఇప్పుడు 3.5 బిలియన్ డాలర్లను దాటేసింది.

ఇప్పుడు ఇదే ట్రెండ్ నెమ్మదిగా మన దగ్గరా మొదలైంది. ఇప్పటికే ‘మోక్ష వాయేజ్’ వద్ద 300 మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని కంపెనీ చెబుతోంది. అయితే, ఈ వింత బిజినెస్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనం పోయాక విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులపై ఆర్థిక భారం, ఏర్పాట్ల హడావుడి పడకుండా ముందే ప్లాన్ చేసుకోవడం మంచిదే అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం.. ఇలాంటి పనులను కూడా డబ్బులిచ్చి ప్రొఫెషనల్స్‌కు అప్పగిస్తే, చివరి రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఎమోషన్స్, బంధాలు యాంత్రికంగా మారిపోతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, రాబోయే రోజుల్లో ఈ ‘అడ్వాన్స్ ఫ్యూనరల్’ బిజినెస్ ఇండియాలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.