Bima Sakhi: సొంతంగా సంపాదించి తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అదిరిపోయే బంపరాఫర్ ప్రకటించింది. ఎలాంటి పెట్టుబడి లేకుండా, ఇంట్లో పనులు చూసుకుంటూనే నెలకు రూ.7,000 వరకు సంపాదించుకునేలా ‘బీమా సఖి’ పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలకు పని నేర్పించడమే కాకుండా, మొదటి మూడేళ్ల పాటు ప్రతినెలా చేతికి ఖర్చులు కూడా ఇస్తారు. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చదువు, వయస్సు ఎంత ఉండాలి?
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పెద్ద పెద్ద చదువులు ఏమీ అక్కర్లేదు. కేవలం 10వ తరగతి పాసైతే చాలు. అలాగే 18 ఏళ్లు నిండిన యువతుల నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న మహిళల వరకు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. పల్లెటూళ్లలో ఉండే ఆడబిడ్డలకు ఇందులో మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
రూ.7,000 ఎలా వస్తాయంటే..
సాధారణంగా ఏ ఇన్సూరెన్స్ పనిలోనైనా పాలసీలు చేస్తేనే కమీషన్ రూపంలో డబ్బులు వస్తాయి. కానీ ‘బీమా సఖి’ స్కీమ్‌లో చేరిన మహిళలకు మాత్రం ఎల్‌ఐసీ మూడేళ్ల పాటు నిర్దిష్ట స్టైపెండ్ ఇస్తుంది.
* మొదటి ఏడాది: ప్రతినెలా రూ. 7,000
* రెండో ఏడాది: ప్రతినెలా రూ. 6,000
* మూడో ఏడాది: ప్రతినెలా రూ. 5,000
ఈ స్టైపెండ్‌తో పాటు, మహిళలకు పాలసీలు ఎలా చేయాలో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఒకవేళ నిర్ణీత టార్గెట్ కంటే ఎక్కువ పాలసీలు చేస్తే, ఈ నెలవారీ డబ్బులకు అదనంగా కమీషన్ కూడా చేతికి అందుతుంది. మూడేళ్ల శిక్షణ పూర్తయ్యాక, పూర్తిస్థాయి ఎల్‌ఐసీ ఏజెంట్‌గా మారి స్థిరమైన ఆదాయం పొందవచ్చు.
ముఖ్యమైన రూల్స్ ఇవే..
* ఇప్పటికే ఇంట్లో ఎవరైనా ఎల్‌ఐసీ ఉద్యోగులు లేదా ఏజెంట్లుగా ఉంటే, వారి రక్తసంబంధీకులకు లేదా బంధువులకు ఈ స్కీమ్ వర్తించదు.
* మొదటి ఏడాది మీరు చేసిన పాలసీలలో కనీసం 65 శాతం పాలసీలు మధ్యలో ఆగిపోకుండా కట్టేలా చూసుకోవాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలంటే
ఆసక్తి ఉన్న మహిళలు ఎక్కడికీ తిరగాల్సిన పనిలేదు. నేరుగా ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేటప్పుడు 10వ తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్, వయస్సు ధ్రువీకరణ పత్రాలను రెడీగా ఉంచుకోవాలి. వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు నమోదు చేసి, ఈ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

