Edible Oil Imports Surge: వంట నూనెల దిగుమతుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు.. 24 శాతం పెరిగిన బిల్లు!

India Edible Oil Imports Ri

India Edible Oil Imports Ri

Edible Oil Imports Surge in India: భారత్‌లో వంట నూనెల వినియోగం భారీగా ఉండటంతో దేశీయ అవసరాలను తీర్చేందుకు విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. దేశంలో నూనెగింజల ఉత్పత్తిని పెంచి ఆత్మనిర్భరత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, వంట నూనెల దిగుమతులు మాత్రం తగ్గడం లేదు. తాజాగా 2025-26 చమురు సంవత్సరంలో భారతదేశ వంట నూనెల దిగుమతులు మరోసారి పెరిగాయి. దిగుమతుల పరిమాణంతో పాటు వాటి కోసం వెచ్చించిన మొత్తం కూడా భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 2026తో ముగిసిన 2025-26 చమురు సంవత్సరంలో భారత్ వంట నూనెల దిగుమతులు 6 శాతం పెరిగి 1.692 కోట్ల టన్నులకు చేరుకున్నాయి. అంతకుముందు 2024-25 చమురు సంవత్సరంలో ఇవి 1.601 కోట్ల టన్నులుగా నమోదయ్యాయి.

మరోవైపు, వంట నూనెల దిగుమతుల కోసం చేసిన ఖర్చు ఏకంగా 24 శాతం పెరిగి సుమారు రూ.2 లక్షల కోట్లకు చేరింది. గత చమురు సంవత్సరంలో దిగుమతి బిల్లు రూ.1,61,126 కోట్లుగా ఉంది. అంటే తక్కువ సమయంలోనే దిగుమతులపై భారత్ చేస్తున్న వ్యయం గణనీయంగా పెరిగింది. దేశీయంగా వంట నూనెల డిమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో భారత్ విదేశీ మార్కెట్లపై ఆధారపడుతోంది. 1990ల నుంచే దేశంలో వంట నూనెల దిగుమతులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి.

SEA గణాంకాల ప్రకారం.. గత 20 ఏళ్లలో వంట నూనెల దిగుమతుల పరిమాణం 2.8 రెట్లు పెరిగింది. అయితే వీటి కోసం చెల్లిస్తున్న దిగుమతి వ్యయం మాత్రం ఏకంగా 15 రెట్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల మార్పులు, దిగుమతులపై ఆధారపడటం వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. వంట నూనెలతో పాటు ఇతర వృక్ష ఆధారిత నూనెలను కలిపి చూస్తే మొత్తం దిగుమతులు కూడా 5 శాతం పెరిగి 1.724 కోట్ల టన్నులకు చేరుకున్నాయి. గత ఏడాది ఇవి 1.636 కోట్ల టన్నులుగా ఉన్నాయి.

2025-26 చమురు సంవత్సరంలో రిఫైన్డ్ వంట నూనెల దిగుమతులు భారీగా తగ్గడం మరో ముఖ్యమైన పరిణామం. గత ఏడాది 17.40 లక్షల టన్నులుగా ఉన్న రిఫైన్డ్ ఆయిల్ దిగుమతులు ఈసారి 8.20 లక్షల టన్నులకు పడిపోయాయి. మొత్తం వంట నూనెల దిగుమతుల్లో రిఫైన్డ్ ఆయిల్ వాటా 11 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి రిఫైన్డ్ పామోలిన్ దిగుమతులు దాదాపుగా నిలిచిపోవడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే నేపాల్ నుంచి రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ దిగుమతులు పెరిగాయి.

మరోవైపు, క్రూడ్ ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు మాత్రం భారీగా పెరిగాయి. గత ఏడాది 1.427 కోట్ల టన్నులుగా ఉన్న ముడి వంట నూనెల దిగుమతులు ఈసారి 1.611 కోట్ల టన్నులకు చేరుకున్నాయి. మొత్తం దిగుమతుల్లో వీటి వాటా 89 శాతం నుంచి 95 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ముడి పామాయిల్ కొనుగోళ్లు పెరగడం ఈ మార్పుకు ప్రధాన కారణం. గతంలో రిఫైన్డ్ పామోలిన్ దిగుమతి చేసుకున్న చోట ఇప్పుడు ముడి పామాయిల్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

పామాయిల్, సాఫ్ట్ ఆయిల్స్ దిగుమతుల్లో పెరుగుదల

SEA విడుదల చేసిన గణాంకాల ప్రకారం పామాయిల్, సాఫ్ట్ ఆయిల్స్ రెండింటి దిగుమతులు పెరిగాయి.

పామాయిల్ దిగుమతులు:
గత ఏడాది: 75.8 లక్షల టన్నులు
2025-26లో: 82.3 లక్షల టన్నులు

సాఫ్ట్ ఆయిల్స్ దిగుమతులు:
గత ఏడాది: 84.3 లక్షల టన్నులు
2025-26లో: 87 లక్షల టన్నులు

మొత్తం వంట నూనెల దిగుమతుల్లో పామాయిల్ వాటా 47 శాతం నుంచి 49 శాతానికి పెరిగింది. మరోవైపు సాఫ్ట్ ఆయిల్స్ వాటా 53 శాతం నుంచి 51 శాతానికి తగ్గింది. సాఫ్ట్ ఆయిల్స్ విభాగంలో ప్రధానంగా సోయాబీన్, సన్‌ఫ్లవర్ వంటి నూనెలు ఉంటాయి.

దేశంలో వంట నూనెల సరఫరా పరిస్థితిని పరిశీలిస్తే నవంబర్ ప్రారంభంలో నిల్వలు కూడా పెరిగాయి. SEA అంచనాల ప్రకారం నవంబర్ 1 నాటికి ఓడరేవుల్లో సుమారు 13.5 లక్షల టన్నుల వంట నూనెల నిల్వలు ఉన్నాయి. ఇక ఫ్యాక్టరీలు, డిపోలు, పంపిణీదారులు, రిటైలర్ల వద్ద ఉన్న సరఫరా వ్యవస్థ నిల్వలు మరో 9.5 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం వంట నూనెల నిల్వలు 23.1 లక్షల టన్నులకు చేరుకున్నాయి. అక్టోబర్ 1 నాటికి ఇవి 20.7 లక్షల టన్నులుగా ఉండగా, నవంబర్ ప్రారంభానికి సుమారు 2.3 లక్షల టన్నులు పెరిగాయి. భారత్‌లో వంట నూనెల వినియోగం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కీలకంగా మారింది. ఇందుకోసం దేశీయంగా పామాయిల్, సోయాబీన్, వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.