సురక్షితమైన పెట్టుబడిని కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) మరోసారి ప్రాధాన్య ఎంపికగా నిలిచాయి. 2026లో పదవీ విరమణ తర్వాత మూలధన రక్షణకు, క్రమమైన ఆదాయానికి ప్రాధాన్యత ఇచ్చే సీనియర్లకు FDలు అద్భుతమైన రాబడిని అందిస్తాయి. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు సాధారణంగా 0.50% (50 బేసిస్ పాయింట్లు) అధిక వడ్డీ రేట్లను పొందుతారు. ఈ వడ్డీ రేట్లు RBI విధానాలు, పెట్టుబడి కాలం, బ్యాంకు ద్రవ్య లభ్యత స్థితిపై ఆధారపడి ఉంటాయి. (రేట్లు ఏప్రిల్ 2026 నాటికి వర్తించేవి; బ్యాంకులు మార్పులు చేయవచ్చు.)
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులలో వడ్డీ రేట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులలో సీనియర్ సిటిజన్లకు FD రేట్లు ప్రస్తుతం సుమారు 7% వరకు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్- 444 లేదా 555 రోజుల వంటి ఎంపిక చేసిన కాలపరిమితులకు 7.10% వరకు వడ్డీ అందిస్తున్నాయి. ఎస్‌బిఐ (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా: 5 నుండి 10 సంవత్సరాల దీర్ఘకాలిక డిపాజిట్లపై 7.00% నుండి 7.05% వరకు వడ్డీ అందిస్తున్నాయి.
ప్రైవేట్ బ్యాంకులు కొంచెం మెరుగైన రాబడులను అందిస్తుండగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 18 నెలల కాలానికి సుమారు 7.50% వరకు అందిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్: దీర్ఘకాలిక రుణాలకు 7.30% వరకు. యాక్సిస్ బ్యాంక్: 7.20% వరకు. ICICI బ్యాంక్, HDFC బ్యాంక్: 7.00% నుండి 7.10% వరకు ఉంటాయి.
చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అత్యధిక రాబడులను అందిస్తున్నాయి. రాబడుల విషయంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBలు) అగ్రగామిగా నిలుస్తున్నాయి. ఇవి 8.00% నుండి 8.50% వరకు వడ్డీని అందిస్తున్నాయి. ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 501 రోజుల FDలపై 8.50% వడ్డీ అందిస్తోంది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 30 నెలల టెన్యూర్‌పై 8.10% నుండి 8.25% వరకు (సీనియర్ సిటిజన్ రేటు). జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 3 సంవత్సరాల టెన్యూర్‌పై 8.00% వరకు. శివాలిక్, ఈక్విటాస్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా వివిధ కాలపరిమితులకు 8.00% నుండి 8.30% వరకు వడ్డీ రేట్లను అందిస్తాయి.
గమనిక: ఈ బ్యాంకులు పెద్ద వాణిజ్య బ్యాంకుల కంటే కొంచెం ఎక్కువ ప్రమాదకరమైనవిగా నిపుణులు చెబుతున్నారు. (DICGC భీమా రూ.5 లక్షల వరకు మాత్రమే వర్తిస్తుంది). ఎక్కువ మొత్తం పెట్టుబడి పెడితే బ్యాంకులను విభజించి పెట్టాలని సూచిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీ డబ్బు మొత్తాన్ని ఒకే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టే బదులు, దానిని స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడులుగా విభజించుకోవాలి (ఇదే FD లాడరింగ్). మెరుగైన రాబడి కోసం, FDలను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) లేదా PPFతో కలిపి పెట్టుకోవచ్చు. SCSSలో ప్రస్తుతం సుమారు 8.2% రేటు ఉంది (ప్రభుత్వ బ్యాకింగ్‌తో).
గమనిక: ఇక్కడ ఇచ్చిన రేట్లు ఏప్రిల్ 2026 నాటి సమాచారం ఆధారంగా ఉన్నాయి. రేట్లు మారవచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు తాజా వివరాలు చూడండి.
