Gold Purity: బంగారం ధరలు తగ్గుతున్నాయి కదా అని ఆభరణాలు కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి.. మీరు కొనే హాల్‌మార్క్ బంగారం (Hallmarked gold) నిజంగానే స్వచ్ఛమైనదా అనే విషయంలో ఇప్పుడు పెద్ద డౌట్స్ మొదలయ్యాయి. హాల్‌మార్క్ వేసిన బంగారంలోనూ కల్తీ జరుగుతోందంటూ ‘ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్’ (IBJA) చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారాయి. యంత్రాలను కూడా అంతుచిక్కిని విధంగా కల్తీ జరుగుతోందట. నగల వ్యాపారులు, హాల్‌మార్కింగ్ సెంటర్లు కుమ్మక్కై నకిలీ స్వచ్ఛత రిపోర్టులు ఇస్తున్నారని, ఫీజుల రూపంలో కమీషన్లు తీసుకుంటూ రేడియం పౌడర్ (Rhenium powder) కలిపి బంగారాన్ని కల్తీ చేస్తున్నారని IBJA ఆరోపించింది.
సాధారణంగా మనం బంగారం కొనేటప్పుడు బీఐఎస్ (Bureau of Indian Standards) ముద్ర ఉందో లేదో చూసుకుంటాం. కానీ ఇప్పుడు ఆ బీఐఎస్ సర్టిఫికేషన్ వ్యవస్థ విశ్వసనీయతపైనే నీలినీడలు కమ్ముకున్నాయి. బీఐఎస్ కేర్ యాప్‌లో (BIS Care app) కనిపించే HUID (Hallmark Unique Identification) డేటాలో చాలా తేడాలు ఉంటున్నాయని IBJA తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు, దేశంలో ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న గోల్డ్ రిఫైనరీల వల్ల కూడా ఈ సమస్య మరింత పెరుగుతోంది. ఈ వ్యవహారంపై స్పందించిన బీఐఎస్, పూర్తి స్థాయిలో చర్చించేందుకు నవంబర్ 23న కీలక సమావేశానికి పిలుపునిచ్చింది.
మన దేశంలో ఏటా సుమారు 800 నుంచి 850 టన్నుల బంగారం వినియోగం అవుతుంటుంది. అయితే, దేశవ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న దాదాపు 4,000 అన్‌రిజిస్టర్డ్ గోల్డ్ రిఫైనర్లను (Unregistered gold refiners) తమ నియంత్రణలోకి తీసుకోవాలని IBJA డిమాండ్ చేస్తోంది. వీటిపై సరైన నిఘా లేకపోవడం వల్ల కల్తీ బంగారం నేరుగా జ్యువెలరీ సప్లై చైన్‌లోకి వెళ్లి, చివరకు సామాన్య వినియోగదారుల చేతికి చేరుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రిఫైనర్లు అసలు బంగారాన్ని శుద్ధి చేయకుండా కేవలం కరిగించి, ఆ కల్తీ లోహాన్ని బంగారు కడ్డీలు, నాణేలు, ఆభరణాల రూపంలో మార్కెట్లోకి వదులుతున్నారని IBJA జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు. దొంగ నోట్లు తయారు చేసి చెలామణిలోకి తెచ్చినట్లే వీరు కల్తీ బంగారాన్ని మార్కెట్లోకి పంపిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
అందుకే నగల వ్యాపారులు కేవలం బీఐఎస్, ఎన్ఏబీఎల్ (National Accreditation Board for Testing and Calibration Laboratories) గుర్తింపు పొందిన రిఫైనర్ల నుంచే బంగారం కొనుగోలు చేసేలా నిబంధనలు పెట్టాలని IBJA కోరుతోంది. సామాన్య ప్రజలు, ఇన్వెస్టర్లు కూడా కల్తీ బారిన పడకుండా ఉండాలంటే గుర్తింపు పొందిన సంస్థల నుంచే గోల్డ్ బార్స్ (Gold bars), కాయిన్స్ కొనాలని సూచించింది. హాల్‌మార్కింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
మరోవైపు, ఈ కల్తీలో వాడుతున్నారని చెబుతున్న ‘రేడియం పౌడర్’ (Rhenium powder) వ్యవహారం ఇప్పుడు జ్యువెలరీ ఇండస్ట్రీని కలవరపెడుతోంది. చైనా నుంచి అక్రమంగా తెస్తున్న ఈ పౌడర్‌ను బంగారంలో కలపడం వల్ల బరువు పెరుగుతుందని, పైగా సాధారణ హాల్‌మార్కింగ్ తనిఖీల్లో ఈ కల్తీ బయటపడదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టెక్నికల్ అంశంపై ‘జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్’ (GJEPC) కూడా దృష్టి సారించింది. అసలు రేడియం పౌడర్‌తో బంగారాన్ని కల్తీ చేయడం సాధ్యమేనా, ఒకవేళ నిజమైతే హాల్‌మార్కింగ్ సెంటర్లలో టెస్టింగ్ విధానాలను మరింత కఠినతరం చేయాలా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ బీఐఎస్‌కి లేఖ రాసింది. నిజానికి రేడియం అనేది 3,100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే కరిగే ఒక రకమైన లోహం. సాధారణంగా ఆభరణాల తయారీలో వాడే 1,050 నుంచి 1,100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఇది బంగారంలో కరగదు, కలవదు. అయినప్పటికీ ఈ కల్తీ ఆరోపణలు రావడంతో ప్రస్తుత టెస్టింగ్ పద్ధతుల సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

