Gold Loan Surge : సంక్షోభ సమయంలో గోల్డ్‌ లోన్లవైపు పరుగులు తీస్తున్న సామాన్యులు.. ఎందుకిలా?

  • దేశంలో రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ లోన్లు
  • బంగారం ధరల పెరుగుదలతో భారీ మార్పు
  • గోల్డ్ లోన్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?
  • గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న రుణాల డిమాండ్
Gold Loan

Gold Loan

Gold Loan Surge : బ్యాంకు లోన్ అంటే ఇప్పటికీ చాలా మందికి ఒక భయం ఉంటుంది. ఫారమ్‌లు… ఆదాయ ధృవీకరణలు… బ్యాంకు చుట్టూ తిరుగుడు… చివరికి ఎప్పుడు డబ్బు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. కానీ ఇలాంటి ఇబ్బందుల మధ్య భారతీయ కుటుంబాలు ఇప్పుడు ఒక పాత సంపదను కొత్త ఆర్థిక ఆయుధంగా మార్చుకుంటున్నాయి. అల్మారాలో భద్రంగా పెట్టుకున్న బంగారు నగలు ఇప్పుడు అత్యవసర సమయాల్లో నగదుగా మారుతున్నాయి. వైద్య ఖర్చులు కావొచ్చు… చిన్న వ్యాపారం నడపడానికి పెట్టుబడి కావొచ్చు… పిల్లల చదువులు కావొచ్చు… వెంటనే డబ్బు అవసరమైతే చాలా మంది ఇప్పుడు నేరుగా గోల్డ్ లోన్ వైపే పరుగులు తీస్తున్నారు.

దేశంలో గోల్డ్ లోన్ల వినియోగం ఎంత వేగంగా పెరుగుతోందో తాజాగా విడుదలైన ‘హౌ ఇండియా లెండ్స్ – క్రెడిట్ ల్యాండ్‌స్కేప్ ఇన్ ఇండియా’ నివేదిక స్పష్టం చేసింది. క్రిఫ్ హై మార్క్ విడుదల చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ లోన్లు దేశంలోనే అత్యంత వేగంగా పెరిగిన రిటైల్ క్రెడిట్ విభాగంగా నిలిచాయి. నాలుగో త్రైమాసికంలో గోల్డ్ లోన్ల పెరుగుదల అన్ని రకాల రుణాలను దాటేసింది. ఏడాది వ్యవధిలో గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో విలువ 50.4 శాతం పెరిగి రూ.18.6 లక్షల కోట్లకు చేరడం ఈ మార్పు తీవ్రతను చూపిస్తోంది.

ఈ భారీ పెరుగుదల వెనుక ప్రధాన కారణం బంగారం ధరల పెరుగుదల. గత ఏడాది నుంచి గోల్డ్ రేట్లు నిరంతరం బలంగా కొనసాగుతుండటంతో అదే నగలపై ఇప్పుడు మరింత ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవకాశం కలుగుతోంది. ఒకప్పుడు తక్కువ విలువైన ఆస్తిగా భావించిన నగలు ఇప్పుడు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు కూడా అత్యంత సురక్షితమైన కాలెటరల్‌గా కనిపిస్తున్నాయి. అందుకే రుణదాతలు కూడా గోల్డ్ లోన్లను మరింత ఉత్సాహంగా ప్రోత్సహిస్తున్నారు.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… గోల్డ్ లోన్లు పెరుగుతున్నప్పటికీ వాటి రీపేమెంట్ నాణ్యత కూడా మెరుగుపడుతోంది. అంటే ప్రజలు అప్పులు తీసుకోవడమే కాదు, వాటిని సకాలంలో తిరిగి చెల్లించగలుగుతున్నారు కూడా. ఈ నివేదిక ప్రకారం హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్ ఫైనాన్స్‌లతో పాటు గోల్డ్ లోన్ విభాగంలో కూడా డిఫాల్ట్ స్థాయులు తగ్గాయి. ఇది రుణ మార్కెట్‌కు ఒక సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.

భారతీయ కుటుంబాల్లో బంగారం కేవలం ఆభరణం కాదు… అత్యవసర సమయాల్లో ఉపయోగపడే భద్రతా నిధి. నగలు అమ్మేస్తే కుటుంబ గౌరవం పోతుందనే భావన చాలా చోట్ల ఇప్పటికీ ఉంది. కానీ గోల్డ్ లోన్ తీసుకుంటే నగలు తాత్కాలికంగా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోవచ్చు. పరిస్థితి సర్దుకున్నాక రుణం తీర్చేసి మళ్లీ నగలు తీసుకురావచ్చు. అందుకే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు గోల్డ్ లోన్లపై ఆధారపడే వారి సంఖ్య పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా మొత్తం రిటైల్ రుణాల మార్కెట్ కూడా భారీగా విస్తరిస్తోంది. మార్చి 2026 నాటికి భారత రిటైల్ లెండింగ్ పోర్ట్‌ఫోలియో విలువ రూ.170.2 లక్షల కోట్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 16.6 శాతం ఎక్కువ. పర్సనల్ లోన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్ ఫైనాన్స్, గోల్డ్ లోన్లు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. హోమ్ లోన్లు కూడా స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తూ రూ.44.4 లక్షల కోట్ల స్థాయికి చేరాయి. అయితే క్రెడిట్ కార్డు బకాయిల వృద్ధి మాత్రం మందగించింది.

ఇంకో కీలక మార్పు కూడా ఈ నివేదికలో బయటపడింది. ప్రజలు ఇప్పుడు చిన్న మొత్తాల కంటే పెద్ద మొత్తాల రుణాలకే మొగ్గు చూపుతున్నారు. దీనిని ఫైనాన్స్ రంగంలో ‘ప్రీమియమైజేషన్’గా పిలుస్తున్నారు. గోల్డ్ లోన్లు, హోమ్ లోన్లు, కన్స్యూమర్ డ్యూరబుల్ ఫైనాన్స్‌లలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే రుణాలు తీసుకునే వారి సంఖ్య కంటే రుణాల మొత్తం విలువ మరింత వేగంగా పెరుగుతోంది.

పండుగల సీజన్ తర్వాత కొన్ని రుణ విభాగాల్లో మందగమనం కనిపించినా, దేశంలోని సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రుణాల డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా పర్సనల్ లోన్స్, టూవీలర్ లోన్స్, కన్స్యూమర్ ఫైనాన్స్ విభాగాల్లో చిన్న పట్టణాల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ పరిస్థితులను పరిశీలిస్తే భారత రుణ మార్కెట్ ఇప్పుడు క్రమంగా సెక్యూర్డ్ లోన్స్ వైపు మళ్లుతున్నట్టు స్పష్టమవుతోంది. అందులో గోల్డ్ లోన్లు ఇకపై కేవలం అత్యవసర పరిష్కారం మాత్రమే కాదు… భారత మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థలో కీలక భాగంగా మారుతున్నాయి.