Drakarys is the new malware that wants to infect your Android phone: ఫోన్లలోని వ్యక్తిగత సమాచారంతో పాటు డబ్బుల్ని దోచుకునేందుకు హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు పన్నుతున్న పన్నాగాలు అన్నీ ఇన్నీ కావు. యాప్‌ల సహకారంతో కొత్త కొత్త మాల్వేర్లను మార్కెట్‌లోకి తీసుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా డ్రాకేరిస్ అనే మాల్వేర్ పంజా విసురుతోందని, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫేస్‌బుక్ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ మాల్వేర్ గనుక ఫోన్‌లో ప్రవేశిస్తే.. వాట్సాప్, యూట్యూబ్‌లు కనిపించకుండా మాయం అవుతాయని వెల్లడించింది.
ఇప్పుడు యువత గేమింగ్ యాప్‌లకు బాగా అలవాటు పడిన నేపథ్యంలో.. ఆ గేమింగ్ యాప్స్ ద్వారానే ఈ డ్రాకేరిస్ మాల్వేర్‌ను స్మార్ట్‌ఫోన్లలోకి జొప్పించేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్టు ఫేస్‌బుక్ పేర్కొంది. ఈ మాల్వేర్ ఫోన్‌లోని యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను కూడా ఏమార్చగలదని ఆ సంస్థ వెల్లడించింది. బిట్టర్ ఏపీటీ అనే హ్యాకింగ్ గ్రూప్ ఈ మాల్వేర్‌ను సృష్టించిందని.. ఒక్కసారి ఇది ఫోన్‌లోకి ఎంటరైన తర్వాత, యూజర్ అనుమతి లేకుండానే ఫోన్‌లో ఏమైనా చేసేందుకు దోహదపడుతుందని వివరించింది. కాబట్టి, దాని జోలికి వెళ్లకుండా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిందిగా ఫేస్‌బుక్ సూచించింది.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రొటెక్షన్ ఉన్న యాప్‌లను మాత్రమే ఇన్ స్టాల్ చేసుకోవాలని ఫేస్‌బుక్ పేర్కొంది. థర్డ్ పార్టీ ఏపీకే సైట్ల నుంచి యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోరాదని, లేకపోతే మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్ల చేతిలో పెట్టినట్టేనని హెచ్చరించింది. ఈమధ్య హ్యాకర్ల దెబ్బకు చాలా మంది తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో.. మాల్వేర్‌లను గుర్తించి, వినియోగదారుల్ని అప్రమత్తం చేస్తోంది ఫేస్‌బుక్. ఈ క్రమంలోనే డ్రాకేరిస్ మాల్వేర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పై విధంగా సూచనల్ని జారీ చేసింది.
