Site icon NTV Telugu

Adani Group: 3 ఏళ్లలో రూ.80 వేల కోట్లు! అదానీ షాకింగ్ షాపింగ్ లిస్ట్ ఇదే!

Adani Group

Adani Group

Adani Group: అదానీ గ్రూప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం గురించి చర్చించుకోవాల్సిందే. మూడేళ్ల కాలంలో అదానీ చేసిన షాపింగ్ లిస్ట్ చూస్తే కచ్చితంగా షాక్ కావాల్సిందే. ఇంతకీ ఆ షాకింగ్ షాపింగ్ ఖర్చు ఎంతో తెలుసా.. రూ.80 వేల కోట్లు. జనవరి 2023 నుంచి అదానీ గ్రూప్ తన వివిధ వ్యాపారాలలో 33 కంపెనీలను కొనుగోలు చేసింది. వీటి విలువ దాదాపు రూ.80 వేల కోట్లు (US$9.6 బిలియన్లు). ఇందులో విశేషమేమిటంటే ఈ కొనుగోళ్లు అనేవి అదానీ గ్రూప్‌పై తీవ్రమైన మోసపూరిత ఆరోపణలను వచ్చిన సమయంలో జరిగాయి. అనంతర కాలంలో కంపెనీ ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదని, సంస్థలో నిధుల కొరత లేదని వివిధ కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడిదారులకు సంకేతాలు ఇచ్చింది.

READ ALSO: Top 10 ODI Run Scorers: 2025 వన్డేల్లో పరుగుల వరద పారించిన టాప్ 10 స్టార్లు వీరే!

అదానీ గ్రూప్ మూడేళ్లలో కొనుగోలు చేసిన సంస్థలలో ఓడరేవుల రంగం సుమారు రూ.28,145 కోట్ల విలువైన కొనుగోళ్లతో ముందుంది. తర్వాత సిమెంట్ రంగం రూ.24,710 కోట్లతో, విద్యుత్ రంగం రూ.12,251 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొత్త, అభివృద్ధి చెందుతున్న వ్యాపారాలలో రూ.3,927 కోట్ల విలువైన కొనుగోళ్లను సంస్థ జరిపింది. అలాగే సంస్థ ఆధ్వర్యంలో ప్రసార, పంపిణీ రంగంలో రూ.2,544 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుంది. జేపీ గ్రూప్ రూ.13,500 కోట్ల కొనుగోలు ఈ జాబితాలో లేదు. అలాగే ఈ జాబితాలో ఇంకా ఖరారు చేయని కొన్ని ఒప్పందాలు కూడా మినహాయించారు.

అదానీ గ్రూప్ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ కొనుగోళ్లు జరిగాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2023 ప్రారంభంలో ప్రస్తుతం పనిచేయని అమెరికన్ షార్ట్-సెల్లర్ సంస్థ అయిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్‌పై అకౌంటింగ్ మోసం, స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను గ్రూప్ నిరంతరం ఖండించింది. అనంతర కాలంలో పోర్టుల నుంచి ఇంధనం వరకు విస్తరించి ఉన్న ఈ సంస్థ ఆ సంక్షోభం నుంచి తిరిగి పుంజుకుంది. దాని బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరిచింది, అలాగే పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ఇతర రంగాలలోకి కూడా విస్తరించింది. నగదు ప్రవాహం, బలమైన లాభాలను స్వీకరించడానికి పోర్టులు, సిమెంట్, విద్యుత్ వంటి ప్రధాన వ్యాపారాలలో కొనుగోళ్లు చేస్తూనే, రుణ తగ్గింపు, ఈక్విటీ పెట్టుబడులు, మూలధన కేటాయింపులను కఠినతరం చేయడానికి ప్రాధాన్యతనిచ్చింది.

మార్కెట్ డేటా ప్రకారం.. గత మూడు సంవత్సరాలలో ముగిసిన 33 ఒప్పందాలలో అతిపెద్ద ఒప్పందం ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్స్‌ల్యాండ్ ఎక్స్‌పోర్ట్ టెర్మినల్ (NQXT)ని ఈ ఏడాది ఏప్రిల్‌లో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లిమిటెడ్ రూ.21,700 కోట్లకు కొనుగోలు చేయడం. అలాగే ఆగస్టు 2023లో అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్స్, రవి సంఘి కుటుంబం నుంచి రూ.5 వేల కోట్లకు సంఘి ఇండస్ట్రీస్‌లో 56.74 శాతం నియంత్రణ వాటాను కొనుగోలు చేసింది. జనవరి 2024లో ACC, ఆసియన్ కాంక్రీట్స్ & సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను రూ.775 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో తమిళనాడులోని మై హోమ్ గ్రూప్‌కు చెందిన టుటికోరిన్ గ్రైండింగ్ యూనిట్‌ను రూ.413.75 కోట్లకు కొనుగోలు చేసింది. అదే ఏడాది జూన్‌లో పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ను రూ.10,422 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 2024లో ఓరియంట్ సిమెంట్‌ను రూ.8,100 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ITD సిమెంటేషన్‌పై నియంత్రణ సాధించడానికి ప్రస్తుత ప్రమోటర్ల నుంచి 46.64 శాతం వాటాను రూ.3,204 కోట్లకు, ఆపై పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ మొత్తం ఒప్పంద విలువ రూ.5,757 కోట్లకు చేరుకుంది. ఓడరేవు రంగంలో అదానీ గ్రూప్ ఏప్రిల్ 2023లో కరైకల్ ఓడరేవును రూ.1,485 కోట్లకు, మార్చి 2024లో గోపాల్‌పూర్ ఓడరేవును రూ.3,080 కోట్లకు, ఆగస్టు 2024లో ఆస్ట్రో ఆఫ్‌షోర్‌ను రూ.1,550 కోట్లకు కొనుగోలు చేసింది. మే 2024లో తాన్సానికి చెందిన దార్ ఎస్ సలాం ఓడరేవును రూ.330 కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా విదేశీ కొనుగోలును కూడా స్టార్ చేసింది.

అదానీ గ్రూప్‌ విద్యుత్ రంగంలో జరిగిన కొనుగోళ్లలో లాంకో అమర్‌కంటక్‌ను రూ.4,101 కోట్లతో, విదర్భ ఇండస్ట్రీస్‌ను రూ.4 వేల కోట్లతో కొనుగోలు చేసింది. కోస్టల్ ఎనర్జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌ను రూ.3,335 కోట్లతో అదానీ గ్రూప్‌లో చేర్చుకుంది. అలాగే డేటా సెంటర్, విద్యుత్, రోడ్లు, రియల్ ఎస్టేట్ రంగాలలో కూడా ఇతర ఒప్పందాలు జరిగాయి. ఈ సంస్థ మెరుగైన లివరేజ్ మెట్రిక్స్, స్థిరమైన పనితీరు రుణదాతలు, పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని తిరిగి సంపాదించడంలో సహాయపడిందని, అలాగే అదానీ గ్రూప్ బ్యాలెన్స్ షీట్ రిస్క్ నియంత్రణలో ఉందనే భావనను బలోపేతం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: NEET UG 2026: డాక్టర్లు అవ్వాలన్న విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. దేశంలో భారీగా పెరగనున్న MBBS సీట్ల సంఖ్య

Exit mobile version