Financial Planning Tips: ఆర్థిక మాంద్యం భయాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు తీవ్ర అస్థిరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకుంటూనే, దానిని లాభదాయకంగా ఎలా పెంచుకోవాలో తెలియక చాలామంది సతమతమవుతుంటారు. అయితే ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ సూచించే కొన్ని ప్రాథమిక ఆర్థిక నియమాలను పాటిస్తే, ఎవరైనా విజయవంతమైన పెట్టుబడిదారుడిగా మారవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మీ భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితం చేసే, ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన ఆ 7 అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్ సూత్రాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. రూల్ ఆఫ్ 72 : మీ డబ్బు ఎప్పుడు రెట్టింపు అవుతుంది?
పెట్టుబడి ప్రపంచంలో ఈ నియమం చాలా పాచుర్యం పొందింది. మీ పెట్టుబడి ఎన్ని సంవత్సరాలలో డబుల్ (రెట్టింపు) అవుతుందో తెలుసుకోవడానికి ఈ సూత్రం ఉపయోగపడుతుంది. మీ పెట్టుబడిపై వచ్చే వార్షిక రాబడి (Interest Rate) తో 72ను భాగించాలి.
ఉదాహరణకు: మీ పెట్టుబడిపై 12% వార్షిక రాబడి వస్తుంటే.. 72/12=6. అంటే మీ డబ్బు 6 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది.
2. రూల్ ఆఫ్ 114 : మూడు రెట్ల రాబడి సూత్రం
మీరు పెట్టిన పెట్టుబడి ఎప్పటికి మూడు రెట్లు (Tripling) అవుతుందో లెక్కగట్టడానికి 114 రూల్ సహాయపడుతుంది. దీని కోసం 114ను మీ ఆశించిన రాబడి రేటుతో భాగించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు: మీ ఇన్వెస్ట్‌మెంట్‌పై 12% రాబడి వస్తుంటే.. 114/12=9.5. అంటే మీ డబ్బు మూడు రెట్లు కావడానికి సుమారు 9.5 సంవత్సరాల సమయం పడుతుంది.
3. రూల్ ఆఫ్ 144 : నాలుగు రెట్ల లాభం ఎప్పుడు?
లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఈ నియమం బాగా ఉపయోగపడుతుంది. మీ డబ్బు నాలుగు రెట్లు పెరగడానికి ఎంత సమయం పడుతుందో ఇది తెలియజేస్తుంది. దీని కోసం 144ను వార్షిక రాబడితో భాగించాలి.
ఉదాహరణకు: మీ రాబడి గనుక 12% ఉంటే.. 144/12=12. అంటే 12 సంవత్సరాలలో మీ పెట్టుబడి నాలుగు రెట్లు పెరుగుతుంది.
4. 50-30-20 రూల్: బడ్జెట్ పంపిణీ ఇలా ఉండాలి
మధ్యతరగతి వారికి ఆర్థిక క్రమశిక్షణ నేర్పే అద్భుతమైన బడ్జెట్ సూత్రం ఇది. మీ నెలసరి ఆదాయాన్ని ఈ నియమం ప్రకారం మూడు భాగాలుగా విభజించుకోవాలి. మీ జీతంలో సగం భాగాన్ని (50 శాతం) ఇంటి అద్దె, ఈఎంఐలు, రేషన్, పిల్లల ఫీజులు వంటి అత్యవసర ఖర్చులకు కేటాయించాలి. ఒక 30 శాతాన్ని మీ అభిరుచులు, వినోదం, షాపింగ్, ప్రయాణాలు లేదా హోటల్ భోజనానికి వాడుకోవచ్చు. మిగిలిన 20 శాతాన్ని కచ్చితంగా పెట్టుబడి పెట్టాలి. ఈ మొత్తాన్ని ఎస్ఐపి (SIP)ల రూపంలోనో లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలోనో దాచుకోవచ్చు.
5. ‘100 మైనస్ వయస్సు’ రూల్
మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత మొత్తాన్ని రిస్క్ ఎక్కువగా ఉండే ఈక్విటీ (స్టాక్స్/మ్యూచువల్ ఫండ్స్)లో పెట్టాలి, ఎంత మొత్తాన్ని సురక్షితమైన డెట్ (బాండ్లు/ఎఫ్‌డీలు) ఫండ్స్‌లో పెట్టాలో ఈ నియమం తేల్చుతుంది. 100 నుంచి మీ ప్రస్తుత వయస్సును తీసివేస్తే వచ్చే సంఖ్యే మీరు ఈక్విటీలో పెట్టాల్సిన పెట్టుబడి శాతం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఉదాహరణకు: మీ వయస్సు 30 ఏళ్లు అనుకుంటే.. 100−30=70. అంటే మీరు 70% ఈక్విటీలో, మిగిలిన 30% డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితం. వయస్సు పెరిగే కొద్దీ రిస్క్ ప్రొఫైల్‌ను తగ్గించుకోవడానికి ఇది తోడ్పడుతుంది.
6. కనీసం 10% పెట్టుబడి నియమం
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సంపాదన స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరూ తమ నెలవారీ ఆదాయంలో కనీసం 10 శాతాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఖర్చు చేయకుండా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి. అంతేకాదు, భవిష్యత్తులో మీ జీతం లేదా ఆదాయం పెరిగే కొద్దీ, ఈ పెట్టుబడి శాతాన్ని కూడా పెంచుకుంటూ పోతేనే దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని కూడబెట్టడం సాధ్యమవుతుంది.
7. ఎమర్జెన్సీ ఫండ్ రూల్
ఆర్థిక ప్రణాళికలో అన్నిటికంటే ముఖ్యమైనది అత్యవసర నిధి. ఊహించని విధంగా ఉద్యోగం కోల్పోయినా, అనారోగ్య సమస్యలు వచ్చినా లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చినా ఈ నిధి మిమ్మల్ని కాపాడుతుంది. మీ నెలవారీ ఖర్చులకు కనీసం ఆరు నెలల సరిపడా మొత్తాన్ని లిక్విడ్ క్యాష్ రూపంలో లేదా వెంటనే డ్రా చేసుకునేలా బ్యాంక్ ఖాతాలో ఎమర్జెన్సీ ఫండ్‌గా పక్కన పెట్టాలి.
డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే.. దానిని సరైన పద్ధతిలో నిర్వహించడం మరో ఎత్తు. పైన పేర్కొన్న ఏడు సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ, దీర్ఘకాలిక ఆలోచనతో ముందడుగు వేస్తే.. ఎలాంటి మార్కెట్ ఒడిదుడుకులనైనా తట్టుకుని ఆర్థికంగా పటిష్టమైన స్థితికి చేరుకోవచ్చు.
