Vaikuntha Ekadashi: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాలలో వైకుంఠ ఏకాదశి ఒకటి. నేడే వైకుంఠ ఏకాదశి. ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువును దర్శించుకునే ఈ మహా పర్వదినానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భక్తులు శాస్త్రోక్త నియమాలను నిష్టగా పాటించాలి. వైకుంఠ ఏకాదశి నాడు అన్నం లేదా బియ్యంతో తయారైన పదార్థాలు భుజించడం నిషిద్ధం. అలాగే తులసి ఆకులను కోయకూడదు. పగటి నిద్ర, కఠినమైన మాటలు, కోపం, ద్వేషం వంటి దుష్ట భావాలు వ్రత ఫలాన్ని నశింపజేస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం పూర్తిగా వర్జించాలి. ముఖ్యంగా ఈ రోజున బ్రహ్మచర్యం పాటించకుండా శారీరక సుఖాలకు లోనైతే పుణ్యం లభించదని గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం చేసి, హరినామ స్మరణలో కాలం గడిపితే సకల పాపాలు తొలగి శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
READ MORE: Khaleda Zia: బంగ్లాదేశ్‌లో విషాదం.. మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
ఉపవాసం: వైకుంఠ ఏకాదశి యొక్క ప్రధాన విశేషం ఉపవాసం. ఈ రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలి. నక్షత్ర దర్శనం అనంతరం పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి.
జాగరణ: విష్ణు భక్తికి జాగరణ ముఖ్యమైన సాధన. వైకుంఠ ఏకాదశి రాత్రి నారాయణ నామ సంకీర్తన, భజనలు, భాగవత కథా కాలక్షేపం చేస్తూ జాగరణ చేయడం ద్వారా మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
పూజా విధానం: ఈ రోజున శ్రీమహావిష్ణువును అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. విష్ణువుకు ప్రీతికరమైన పసుపు రంగు పువ్వులు, తులసి మాలను సమర్పించాలి. పులిహోర, చక్రపొంగలి నైవేద్యంగా అర్పించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శ్రేష్ఠం. ముఖ్యంగా శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వారం నుండి దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
శ్రేష్ఠ దానాలు: వైకుంఠ ఏకాదశి రోజున బ్రాహ్మణులకు వస్త్రదానం, సువర్ణదానం, భూదానం, జలదానం, అన్నదానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున తులసి మొక్కను దానంగా ఇవ్వడం కూడా ఎంతో శుభప్రదం. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి కథను చదవడం లేదా వినడం కూడా పుణ్యదాయకం.
నామ స్మరణ: ఈ రోజున వీలైనంత ఎక్కువసార్లు ‘ఓం నమో నారాయణాయ నమః’ లేదా ‘జై శ్రీమన్నారాయణ!’ అనే మంత్రాలను జపిస్తూ ఉండాలి.
తప్పనిసరి నియమాలు: వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు మధ్యాహ్నం కూడా ఆహారం తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఉల్లి, వెల్లుల్లి వంటి తామస ఆహారాలను పూర్తిగా వదిలేయాలి. రాగద్వేషాలకు దూరంగా ఉండాలి.
వైకుంఠ ఏకాదశి వ్రత మహత్యం: నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభించి, మరణానంతరం వైకుంఠ ధామాన్ని చేరుతారని విశ్వాసం. వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మనమూ భక్తితో ఆచరించి, ఆ శ్రీమన్నారాయణుని అపార అనుగ్రహాన్ని పొందుదాం.
