Site icon NTV Telugu

NTV Specials : సలేశ్వర క్షేత్రం.. ఓ సాహస యాత్రే..

Saleshwara Yatra

Saleshwara Yatra

దట్టమైన అడవి. ఎత్తైన కొండలు. పాల నురగలా జాలువారే జలపాతం. ప్రకృతి రమణీయతతో పాటు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నదే సలేశ్వర క్షేత్రం. అక్కడి శివయ్య దర్శనానికి ఓ సాహసయాత్ర చేయాల్సిందే. ఏడాదిలో మూడు రోజుల పాటు మాత్రమే తెరచి ఉంచే ఆ సలేశ్వర క్షేత్రానికి మరో పేరే తెలంగాణ అమరనాధ్ యాత్ర. ఇంతకీ ఆ సలేశ్వర క్షేత్రం ఎక్కడుందో.. క్షేత్ర ప్రత్యేకతలపై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ

నల్లమల లోయలో కొలువుదీరిన సలేశ్వర లింగమయ్య దర్శనం అంటే అదో సాహసయాత్ర. ఎత్తైన కొండలు.. జాలువారే జలపాతాలు … ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువుదీరిన స్వామివారిని ఎంతో సాహసం చేస్తే గానీ దర్శించుకోలేరు. రాళ్లు, రప్పల్లో కిలోమీటర్ల మేర కాలినడకన అడుగులు వేస్తూ … కొండలు ఎక్కి దిగుతూ …. సహజసిద్దంగా వెలసిన జలపాతాలను దాటుకోని పున్నమి ఘడియల్లో ఆ శివయ్య సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది . దారిలో ప్రతిధ్వనించే లింగమయ్య పిలుపులు ,… దారి పొడవునా పడే నీటి తుంపర్లు ….. వంద మీటర్ల పైనుంచి జాలువారే జలపాతం …. ఇలా ఒక్కో ద్రుష్యం ఒక్కో అద్భుతం . ఒక్కసారి ఈ యాత్ర చేసిన వారు ఆ గురుతులను జీవితాంతం గుర్తుంచుకుంటారు. అలాంటి సాహసోపేత తెలంగాణ అమరనాథ్ యాత్ర గా పిలుచుకునే సలేశ్వర యాత్ర ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది.

నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉంది సలేశ్వర క్షేత్రం. ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి సమయంలో ఈ జాతర జరుగుతుంది. అమరనాథ్ యాత్రను తలపించేలా ఉండే.. సలేశ్వర జాతరకు భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు . ‘వస్తున్నాం వస్తున్నాం లింగమయ్యా’, ‘పోతున్నాం పోతున్నాం లింగమయ్యా’ అని స్మరిస్తూ…రాత్రీ పగలూ భక్తులు నడక సాగించి ఆలయాన్ని చేరుకుంటారు ఆ లింగ‌మ‌య్య భ‌క్తులు. మొదట ఈ క్షేత్రాన్ని సర్వేశ్వరంగా పిలిచేవారు. ఆ తర్వాత ఇది సలేశ్వరంగా పాపులరైంది. చెంచుల సంప్రదాయ జాతర ఇది. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు కొలిచే…లింగమయ్య స్వామి, గంగమ్మలు ఘనంగా పూజలందుకుంటున్నారు ఈ స‌లేశ్వ‌ర క్షేత్రంలో . ఈ దేవాలయానికి పెద్ద చరిత్ర ఉంది. ఆలయ నిర్మాణాన్నిబట్టి 6, 7 శతాబ్దాలకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీ.శ 13వ శతాబ్ధంలోని మల్లికార్జున పండితారాద్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్ర మహాత్యంలో సలేశ్వర విశేషాలను పాల్కురికి సోమనాధుడు వర్ణించాడు. 17వ శతాబ్దం చివరలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతోంది.

సలేశ్వరం వెళ్లాలంటే అమ్రాబాద్ మండలం ఫరహాబాద్ చౌరస్తా నుంచి దట్టమైన అడవుల్లో 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సలేశ్వరానికి మూడు నడక దారులున్నాయి. ఒకటి మన్ననూరు నుంచి.. రెండోది బల్మూరు మండలం కొండనాగుల నుంచి.. మూడోది లింగాల నుంచి నడక సాగిస్తూ.. ఆలయాన్ని దర్శించుకోవచ్చు. దట్టమైన అడవిలో ఎత్తయిన కొండల్లో.. ప్రకృతి అందాల మధ్య సాగుతుంది సలేశ్వరం యాత్ర. జాతరకు కాలిబాటన వచ్చే భక్తులను ప్రకృతి అందాలు అడుగడుగునా కట్టిపడేస్తాయి.

మండువేసవిలో జాలువారే జలపాతాలు.. నీటి గుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి. ఎంత కష్టమైనా ఇష్టంగా సలేశ్వరం చేరుకుని మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. సలేశ్వరం వెళ్లే దారిలో మెట్టు మైసమ్మ దర్శనమిస్తుంది, మెట్టు దిగిన తర్వాత పాపనాశన తీర్థం కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంత దూరం వెళ్తే భైరవుని గుడి కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని భక్తులు తప్పక దర్శించుకుంటారు. ఆ తర్వాత లింగమయ్య ఆలయం, వీరభద్రుని గుడి, గంగమ్మ ఆలయం కనిపిస్తాయి. జలపాతాల లోయలో కొలువుదీరిన స్వామి వారికి ఇప్పపూతను నైవేద్యంగా పెడతారు. గుట్టలను దాటుతూ సాగుతున్న సాహ‌స‌యాత్ర‌ సమయంలో ఎన్నో గుహలు, గుట్టలపై నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇక్కడి గుడిలోని శంకుతీర్ధంలో స్నానాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఎన్నో వనమూలికల మీదుగా పారే గుండంలో స్నానం చేయటం వల్ల సర్వరోగాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. గుండంలో స్నానంచేసి.. పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో పూజలు చేస్తారు. నాగదోశం ఉన్నవారు వెండి వస్తువులు చేయించి మొక్కులు తీర్చుకుంటారు.

దట్టమైన నల్లమల అడవిలో ఉన్నందున అనాదిగా దేవతలకు పూజాకార్యక్రమాలు చెంచులే నిర్వహిస్తున్నారు. దేవాలయాల నిర్వహణ తమ బాధ్యతగా భావిస్తారు. జాతరకు 15 రోజుల ముందు నుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు . భక్తులకు ఇబ్బందులు కలగకుండా దారులు తీర్చిదిద్దుతున్నారు క‌మిటీ స‌భ్యులు. గతంలో గిరిజనులు, చెంచులు ఎక్కువగా సలేశ్వర లింగమయ్యను దర్శించుకునేవారు.. క్రమేణా భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం హైద్రాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ తదితర ప్రాంతాల నుంచే కాక.. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ అమ‌ర‌నాథ్ యాత్ర గా పిలుచుకునే ఈ స‌లేశ్వ‌రం యాత్ర చేసేందుకు , సాహ‌సోపేత‌యాత్ర గా భావిస్తూ అనేక మంది త‌ర‌లివ‌స్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే లింగ‌మ‌య్య ను ద‌ర్శించుకోవ‌డంతో పాటు ప్ర‌శాంత వాతావ‌ర‌ణం, న‌ట్ట‌డ‌విలో సాగే యాత్ర అనుభూతిని పొంద‌డానికి ప‌లువురు ఆసక్తి క‌న‌బ‌రుస్తున్నారు.

తెలంగాణ అమర్నాథ్ యాత్ర గా పిలవబడే నల్లమలలోని సలేశ్వర లింగమయ్య జాతరకు ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత అనుమతి లభించింది . కరోనా నేపథ్యంలో గడిచిన రెండేళ్లుగా భక్తులకు అనుమతి లేదు. ఈ యేడు జరిగే సలేశ్వర జాతరకు అటవీశాఖ అధికారులు పలు ఆంక్షల నడుమ అనుమతి ఇచ్చారు. ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఏడు రోజుల పాటు సాగే సలేశ్వర జరిగే బ్రహ్మోత్సవాలను, అటవీశాఖ మూడు రోజులకు కుదించింది. … ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతిస్తామని అటవీ శాఖ ప్రకటించింది . మొత్తం మీద అటవీ అందాలను తిలకిస్తూ అడ్వెంచర్ యాత్రగా భావించి ఆ శివయ్య దర్శనం చేసుకునేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు.

Exit mobile version