Koti Deepotsavam 2026 Day 14: భక్తి టీవీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం 2026 వేడుకల్లో 14వ రోజు విశేష కార్యక్రమాలు (నవంబర్ 27, 2026, కార్తిక శుక్రవారం – సంకష్టహరచతుర్థి) జరగనున్నాయి. ఆధ్యాత్మిక శోభ, భక్తి భావాలతో సాగే ఈ రోజు వేడుకల్లో అనుగ్రహ భాషణం, ప్రవచనామృతం, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవం, వాహన సేవ వంటి పలు ఆధ్యాత్మిక ఘట్టాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.
ఆధ్యాత్మిక ప్రవచనామృతం
ఇవాళ జరిగే విశేష కార్యక్రమాల్లో భాగంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ భక్తులకు అనుగ్రహ భాషణం అందించనున్నారు. గురుదేవుల ఆధ్యాత్మిక సందేశంతో పాటు బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ప్రవచనామృతం వినిపించనున్నారు.
వేదికపై ప్రత్యేక పూజలు..
వేదికపై నిర్వహించే ప్రత్యేక పూజల్లో భాగంగా కొల్లూరు మూకాంబికాదేవికి సౌభాగ్య అభిషేకం, అలాగే కొల్హాపూర్ మహాలక్ష్మికి కోటిగాజుల అర్చన అత్యంత వైభవంగా చేయనున్నారు. మరోవైపు భక్తులచే జరిపే పూజా కార్యక్రమంలో లక్ష్మీదేవి విగ్రహాలకు కోటిగాజుల అర్చన నిర్వహించే ఏర్పాట్లు చేశారు. కార్తిక శుక్రవారం పర్వదినం వేళ అమ్మవార్లకు ప్రీతిపాత్రమైన గాజులతో జరిగే ఈ విశేష పూజలు భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వనున్నాయి.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం..
ఈ రోజు వేడుకల్లో అత్యంత కీలకమైన, వీక్షించిన జన్మధన్యం కలిగించే ఘట్టంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం కనులపండువగా జరగనుంది. కల్యాణ వేడుకతో పాటు స్వామివారికి పల్లకీ వాహన సేవ కూడా నిర్వహించనున్నారు.

