Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..

Koti Deepotsavam 2026 Day 1

Koti Deepotsavam 2026 Day 1

Koti Deepotsavam 2026: కార్తీక మాసంలో తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. కార్తీక స్నానాలు, దైవదర్శనాలు, దీపారాధనలు, ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఈ పవిత్ర మాసంలో భక్తులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమాల్లో ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటిదీపోత్సవం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా రచనా టెలివిజన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతి ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మహా దీపయజ్ఞం ఇవాళ ప్రారంభం కానుంది.. ఇవాళ్టి నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ప్రతిరోజూ కొన్ని విశేష కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది భక్తి టీవీ యాజమాన్యం..

ఇక, కోటి దీపోత్సవం 2026 వేడుకల్లో భాగంగా నవంబర్ 14న మొదటి రోజు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్తీక శుద్ధ పంచమి సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు, ప్రవచనాలు, స్వామివారి కల్యాణం, వాహన సేవలు జరగనున్నాయి. మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా పుష్పగిరి మహాసంస్థానానికి చెందిన పూజ్యశ్రీ విద్యాశంకరభారతి మహాస్వామీజీ అనుగ్రహ భాషణం ఇవ్వనున్నారు. అనంతరం బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనామృతం అందించనున్నారు. వేదికపై నిర్వహించే ప్రత్యేక పూజల్లో భాగంగా కాశీ స్ఫటికలింగానికి అష్టోత్తర శత శంభాభిషేకం, కోటిమల్లెల అర్చన నిర్వహించనున్నారు. అలాగే భక్తులచే శివలింగాలకు కోటిమల్లెల అర్చన కార్యక్రమం జరగనుంది. అదేవిధంగా కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. చివరిగా హంస వాహన సేవ కార్యక్రమం జరగనుంది.

నవంబర్ 14న మొదటి రోజు కార్యక్రమాల వివరాలు:
– తిథి: కార్తీక శుద్ధ పంచమి
– అనుగ్రహ భాషణం: పూజ్యశ్రీ విద్యాశంకరభారతి మహాస్వామీజీ (పుష్పగిరి మహాసంస్థానం)
– ప్రవచనామృతం: బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి
– వేదికపై పూజ: కాశీ స్ఫటికలింగానికి అష్టోత్తర శత శంభాభిషేకం, కోటిమల్లెల అర్చన
– భక్తులచే పూజ: శివలింగాలకు కోటిమల్లెల అర్చన
– కల్యాణం: కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కల్యాణం
– వాహన సేవ: హంస వాహనం

భక్తులకు ఉచితంగా పూజా సామగ్రి పంపిణీ
కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు రచనా టెలివిజన్ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీపారాధనకు అవసరమైన పూజా సామగ్రి, దీపారాధన వస్తువులను భక్తులకు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా భక్తి టీవీ ఈ మహా దీపయజ్ఞాన్ని నిర్వహిస్తూ వస్తోంది. వేలాది మంది భక్తులు ఒకే ప్రాంగణంలో దీపాలను వెలిగిస్తూ సామూహిక దీపారాధనలో పాల్గొనడం ఈ ఉత్సవానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తోంది. ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటలకు ఈ మహా దీపయజ్ఞం ప్రారంభమవుతుంది. దీపపు కాంతులు, వేద మంత్రోచ్ఛారణలు, ప్రవచనామృతాలు, దేవదేవుల కల్యాణాలతో ఎన్టీఆర్ స్టేడియం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. కార్తీక మాసం శివుడు, విష్ణుమూర్తి ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. ఈ మాసంలో కార్తీక స్నానాలు, దీపారాధనలు, వివిధ వ్రతాలు ఆచరించడం విశేష పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్రమైన మాసంలో నిర్వహించే కోటిదీపోత్సవం భక్తుల హృదయాల్లో భక్తిభావాన్ని మరింత పెంపొందిస్తోంది. వేలాది దీపాల వెలుగుల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తూ, సామూహిక దీపారాధనలో పాల్గొనేందుకు భక్తులకు ఈ వేడుక గొప్ప అవకాశం కల్పిస్తోంది. ఈ మహా దీపయజ్ఞంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఎన్టీవీ-భక్తి టీవీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది.