వివాహిత మహిళలు తమ భర్తల ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కోసం ఆచరించే ముఖ్యమైన పండుగల్లో కర్వా చౌత్ ఒకటి. హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసం కృష్ణ పక్ష చతుర్థి తిథి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు మహిళలు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు నిర్జల ఉపవాసం పాటిస్తూ, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కర్వా చౌత్ వ్రత కథను విని, చంద్రుడిని దర్శించుకున్న తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే చతుర్థి తిథి అర్ధరాత్రి సమయంలో ప్రారంభం కావడం లేదా ముగియడం వల్ల పండుగ తేదీపై కొన్నిసార్లు సందేహాలు వస్తుంటాయి. 2026లో కర్వా చౌత్ అక్టోబర్ 29, గురువారం నిర్వహించుకోవాలి. అక్టోబర్ 30న కాదు.
కర్వా చౌత్ 2026 తేదీ, శుభ ముహూర్తం
న్యూఢిల్లీ పంచాంగం ప్రకారం అక్టోబర్ 29న కర్వా చౌత్ పండుగను ఆచరించనున్నారు. ఈ రోజున సాయంత్రం నిర్ణీత శుభ ముహూర్తంలో పూజలు నిర్వహించి, చంద్ర దర్శనం అనంతరం వ్రతాన్ని పూర్తి చేస్తారు. పంచాంగ వివరాల ప్రకారం చతుర్థి తిథి అక్టోబర్ 29న తెల్లవారుజామున 1.06 గంటలకు ప్రారంభమై, అదే రోజు రాత్రి 10.09 గంటలకు ముగుస్తుంది. పూజా ముహూర్తం సాయంత్రం 5.38 గంటల నుంచి 6.56 గంటల వరకు ఉంది. ఉపవాస సమయం ఉదయం 6.31 గంటల నుంచి రాత్రి 8.17 గంటల వరకు ఉంటుందని న్యూఢిల్లీ పంచాంగం సూచిస్తోంది. చంద్రోదయం రాత్రి 8.17 గంటలకు ఉంటుందని అంచనా. అయితే ఇవి న్యూఢిల్లీకి సంబంధించిన సమయాలు మాత్రమే. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో చంద్రోదయ సమయం మారవచ్చు. అందువల్ల స్థానిక పంచాంగం ప్రకారం చంద్ర దర్శన సమయాన్ని తెలుసుకుని పూజలు, వ్రత విరమణకు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.
కర్వా చౌత్ వెనుక ఉన్న కథ ఏమిటి?
కర్వా చౌత్ పండుగకు సంబంధించిన సంప్రదాయ వ్రత కథల్లో కర్వా అనే భక్తురాలి కథకు ప్రత్యేక స్థానం ఉంది. జానపద విశ్వాసం ప్రకారం కర్వా తన భర్తతో కలిసి ఒక గ్రామంలో నివసించేది. ఒకరోజు ఆమె భర్త నదిలో స్నానం చేస్తుండగా మొసలి అతని కాలును పట్టుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న భర్త కేకలు వేయడంతో కర్వా వెంటనే అక్కడికి చేరుకుంది. ఆమె ధైర్యంగా మొసలిని ఒక దారంతో కట్టి, తన భర్తను రక్షించాలని యమధర్మరాజును ప్రార్థించినట్లు కథనం చెబుతుంది. మొసలికి శిక్ష విధించి, తన భర్తకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని కోరినట్లు వ్రత కథలో ఉంటుంది. కర్వా చూపిన ధైర్యం, భక్తి, సంకల్పానికి మెచ్చిన యముడు ఆమె భర్తకు దీర్ఘాయుష్షు ప్రసాదించి, మొసలిని యమలోకానికి పంపినట్లు సంప్రదాయ కథనం వివరిస్తుంది. ఈ కథ ఆధారంగా కర్వా మాతను భక్తితో పూజించి ఉపవాసం పాటిస్తే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుందని, భర్తకు ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఇది మతపరమైన సంప్రదాయ కథనం మాత్రమే. దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని చెప్పలేం.
కర్వా చౌత్ వ్రతాన్ని ఎందుకు పాటిస్తారు?
కర్వా చౌత్ అనేది చాలామంది వివాహిత హిందూ మహిళలకు మతపరంగానే కాకుండా భావోద్వేగపరంగానూ ప్రాధాన్యం ఉన్న పండుగ. సంప్రదాయంగా మహిళలు తమ భర్తల ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. కుటుంబ ఆచారాలను బట్టి పూజా విధానాలు, వ్రత నియమాల్లో మార్పులు ఉండవచ్చు. సాధారణంగా ఉదయం నుంచి ఉపవాసం ప్రారంభించి, సాయంత్రం పూజలు నిర్వహిస్తారు. వ్రత కథను చదవడం లేదా వినడం, కర్వా మాతను పూజించడం వంటి ఆచారాలు పాటిస్తారు. రాత్రి చంద్రుడు కనిపించిన తర్వాత చంద్రుడికి ప్రార్థనలు చేసి, నీటిని సమర్పించి, అనంతరం ఉపవాసాన్ని విరమించడం సంప్రదాయం. ప్రాంతాలు, కుటుంబ సంప్రదాయాలను బట్టి ఈ పండుగ ఆచరణలో తేడాలు కనిపిస్తాయి. కొందరు మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహిస్తే, మరికొందరు సామూహికంగా వ్రత కథను వింటారు. దాంపత్య బంధంపై ప్రేమ, నమ్మకం, శుభాకాంక్షలను వ్యక్తం చేసే పండుగగా కర్వా చౌత్కు గుర్తింపు ఉంది.
ఉపవాసం విషయంలో జాగ్రత్త
కర్వా చౌత్ సంప్రదాయంలో నిర్జల ఉపవాసానికి ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఆహారం, నీరు తీసుకోకుండా ఉండటం ప్రతి ఒక్కరికీ అనుకూలం కాకపోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, మందులు వాడేవారు ఉపవాస నియమాలను పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యాన్ని ఇబ్బందులకు గురిచేయకుండా, తమ శారీరక పరిస్థితికి అనుగుణంగా ఆచారాలను పాటించాలి.

