Dhanteras 2026: లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి? బంగారం కొనడానికి సరైన సమయం ఏది..?

Dhanteras 2026

Dhanteras 2026

Dhanteras 2026: దీపావళి పండుగ వచ్చేస్తోంది.. ఇక, దీపావళికి ముందు వచ్చే ముఖ్యమైన పర్వదినం ధంతేరస్. ఈ ఏడాది నవంబర్ 6, శుక్రవారం ధంతేరస్ వేడుకలను జరుపుకుంటున్నారు. సంపద, ఆరోగ్యం, సుఖసంతోషాలు, శ్రేయస్సుకు ప్రతీకగా ఈ పండుగను భావిస్తారు. ధంతేరస్ రోజున ధన్వంతరి దేవుడు, లక్ష్మీదేవి, కుబేరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ రోజున పూజలు చేయడంతో పాటు బంగారం, వెండి, పాత్రలు, వాహనాలు, ఇతర కొత్త వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదమని హిందూ సంప్రదాయంలో నమ్ముతారు. ఇక, ఈ ఏడాది త్రయోదశి తిథి రెండు రోజుల పాటు ఉండటంతో ధంతేరస్ పండుగ తేదీపై కొంత గందరగోళం నెలకొనగా.. ప్రదోష కాలంలో పూజలకు అనుకూలమైన సమయం నవంబర్ 6వ తేదీనే ఉండటంతో ఈ రోజే ధంతేరస్ జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ధంతేరస్ పూజకు శుభ ముహూర్తం, బంగారం, వెండి కొనుగోలుకు అనుకూలమైన సమయాలు, చౌఘడియా వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ధంతేరస్ 2026 తేదీ, తిథి వివరాలు
హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి నవంబర్ 6వ తేదీ ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై నవంబర్ 7వ తేదీ ఉదయం 10:47 గంటల వరకు కొనసాగుతుంది. ప్రదోష కాలంలో పూజలు నిర్వహించడానికి అనుకూలమైన సమయం నవంబర్ 6వ తేదీనే ఉండటంతో ఈ రోజున ధంతేరస్ పండుగను జరుపుకుంటున్నారు. పంచాంగం ప్రకారం ధంతేరస్ పూజకు సాయంత్రం 6:02 గంటల నుంచి రాత్రి 7:57 గంటల వరకు శుభ ముహూర్తం ఉంది. ప్రదోష కాలం సాయంత్రం 5:32 నుంచి రాత్రి 8:09 గంటల వరకు ఉండగా, వృషభ కాలం సాయంత్రం 6:02 నుంచి రాత్రి 7:57 గంటల వరకు ఉంటుంది.

బంగారం, వెండి కొనుగోలుకు శుభ సమయాలు
ధంతేరస్ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున విలువైన లోహాలను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపద, సిరిసంపదలు పెరుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే చాలామంది బంగారు నాణేలు, వెండి ఆభరణాలు, పాత్రలు, లక్ష్మీ గణేశుల విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది షాపింగ్‌కు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 గంటల నుంచి మధ్యాహ్నం 12:56 గంటల వరకు ఉంది. అలాగే శుభ చౌఘడియా ప్రకారం మధ్యాహ్నం 12:04 నుంచి 1:26 గంటల వరకు కొనుగోళ్లు చేయడానికి అనుకూలమైన సమయంగా పేర్కొన్నారు. సాయంత్రం షాపింగ్ చేయాలనుకునేవారు తమ ప్రాంతానికి సంబంధించిన స్థానిక పంచాంగం ప్రకారం శుభ సమయాలను తెలుసుకోవడం మంచిది.

ధంతేరస్ 2026 శుభ చౌఘడియా సమయాలు
ధంతేరస్ రోజున శుభ, లాభ, అమృత చౌఘడియా సమయాల్లో కొనుగోళ్లు చేయడం మంచిదని సంప్రదాయంగా భావిస్తారు. నవంబర్ 6వ తేదీకి సంబంధించిన ముఖ్యమైన శుభ సమయాలు ఇవి.
* శుభ చౌఘడియా: ఉదయం 8:16 నుంచి 9:48 గంటల వరకు.
* అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:56 గంటల వరకు.
* ప్రదోష కాలం: సాయంత్రం 5:49 నుంచి రాత్రి 8:23 గంటల వరకు.

అయితే చౌఘడియా, పూజా ముహూర్తాలు నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలను అనుసరించి స్థానిక పంచాంగంలో మార్పులు ఉంటాయి.

ధంతేరస్ రోజున ఏ వస్తువులు కొనుగోలు చేయాలి?
ధంతేరస్ రోజున బంగారం, వెండి, ఇత్తడి, రాగి పాత్రలు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. వీటితో పాటు చీపుర్లు, ధనియాలు, లక్ష్మీ గణేశుల విగ్రహాలను కొనుగోలు చేయడం కూడా ఆనవాయితీగా వస్తోంది. మరికొందరు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే కొన్ని సంప్రదాయాల ప్రకారం ధంతేరస్ రోజున ఇనుము, పదునైన వస్తువులను కొనుగోలు చేయకూడదని చెబుతారు. ఇవన్నీ మతపరమైన విశ్వాసాలు మాత్రమే. కుటుంబ సంప్రదాయాలు, వ్యక్తిగత నమ్మకాల ప్రకారం ప్రజలు వీటిని పాటిస్తుంటారు.

ధంతేరస్ రోజున యమదీపం ఎందుకు వెలిగిస్తారు?
ధంతేరస్ పర్వదినంలో యమదీపానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ రోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణ దిశగా దీపం వెలిగించి యమధర్మరాజుకు సమర్పించే సంప్రదాయం ఉంది. ఇలా దీపం వెలిగించడం వల్ల కుటుంబ సభ్యులకు అకాల మరణ భయం తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ సందర్భంగా మట్టి ప్రమిదలో ఆవనూనె పోసి నాలుగు వత్తులతో దీపం వెలిగిస్తారు. కుటుంబ సభ్యుల దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం, క్షేమం కోసం యమధర్మరాజును ప్రార్థిస్తారు.

ధంతేరస్ పండుగను ఎందుకు జరుపుకుంటారు?
పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో ధన్వంతరి దేవుడు అమృత కలశంతో ఆవిర్భవించారు. అందుకే కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి రోజును ధనత్రయోదశి లేదా ధంతేరస్‌గా జరుపుకుంటారు. ధన్వంతరి దేవుడిని ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి అధిపతిగా భావిస్తారు. లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యానికి ప్రతీక కాగా, కుబేరుడు సంపదకు రక్షకుడిగా పూజలందుకుంటాడు. అందుకే ధంతేరస్ రోజున ఈ ముగ్గురినీ భక్తిశ్రద్ధలతో పూజించి కుటుంబానికి మంచి ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక అభివృద్ధి, సుఖసంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థిస్తారు.