Volkswagen T-Roc R: 328HP పవర్‌తో Volkswagen T-Roc R SUV.. 250kmph టాప్ స్పీడ్‌తో అదరగొట్టే ఫీచర్లు!

Volkswagen T Roc R

Volkswagen T Roc R

Volkswagen T-Roc R: ప్రముఖ కార్ల తయారీ సంస్థ Volkswagen కొత్త పర్ఫార్మెన్స్ SUV T-Roc Rను ఆవిష్కరించింది. స్పోర్టీ డిజైన్, పవర్ ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజిన్, అత్యాధునిక టెక్నాలజీతో ఈ కొత్త SUVను రూపొందించింది. ఇందులో 328hp పవర్‌ను ఉత్పత్తి చేసే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని అందించారు. అంతేకాకుండా స్టాండర్డ్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్, 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఈ కారు కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు.

కొత్త Volkswagen T-Roc Rలో 2.0 లీటర్ EA888 evo5 టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 328hp గరిష్ట పవర్‌ను, 420Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని జత చేశారు. Volkswagen తన R సిరీస్ మోడళ్లలో తొలిసారిగా 48V టెక్నాలజీని ఉపయోగించడం విశేషం. ఈ ఇంజిన్‌ను 7-స్పీడ్ డైరెక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్ (DSG), 4MOTION ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అనుసంధానించారు.

ఈ రెండు ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. లాంచ్ కంట్రోల్ సాయంతో ఈ SUV కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో 250 kmphకు పరిమితం చేశారు. 48V సిస్టమ్ తక్కువ ఇంజిన్ వేగం వద్ద ఎక్కువ టార్క్ అందించేందుకు ఎలక్ట్రిక్ కంప్రెసర్‌కు కూడా శక్తిని అందిస్తుంది. అలాగే బ్రేకింగ్ సమయంలో శక్తిని తిరిగి సేకరించి, అవసరమైనప్పుడు ఉపయోగించుకునే రీజనరేటివ్ ఎనర్జీ టెక్నాలజీని కూడా కలిగి ఉంది.

Volkswagen T-Roc Rలో R-Performance Torque Vectoring టెక్నాలజీని అందించారు. ఇందులోని టార్క్ స్ప్లిటర్ ముందు, వెనుక చక్రాల మధ్య పవర్‌ను పంపిణీ చేయడంతో పాటు వెనుక రెండు చక్రాలకు అందే టార్క్‌ను విడివిడిగా నియంత్రిస్తుంది. దీనివల్ల రోడ్డు పరిస్థితులు మారినప్పుడు మెరుగైన గ్రిప్, కంట్రోల్ లభిస్తాయని కంపెనీ చెబుతోంది.

ఈ SUVలో Adaptive DCC Sports Suspension, Progressive Steering వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇందులో Race, Special, Drift అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ లభిస్తాయి.

Race Mode: స్పోర్టీ డ్రైవింగ్ కోసం ఇంజిన్, సస్పెన్షన్, స్టీరింగ్, AWD వ్యవస్థను అనుకూలంగా సెట్ చేస్తుంది.
Special Mode: ప్రసిద్ధ Nürburgring Nordschleife రేస్ ట్రాక్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు.
Drift Mode: ప్రత్యేకంగా నియంత్రిత రేస్ ట్రాక్‌లపై డ్రిఫ్టింగ్ కోసం ఉపయోగపడుతుంది.

డిజైన్ పరంగా కొత్త Volkswagen T-Roc R మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో R-స్పెసిఫిక్ ఫ్రంట్ బంపర్, రియర్ డిఫ్యూజర్, హై-గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్‌ను అందించారు. వెనుకవైపు నాలుగు పైపులతో కూడిన స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ SUVలో స్టాండర్డ్‌గా 19 ఇంచుల Zandvoort అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. అదనంగా 20 ఇంచుల Warmenau ఫోర్జ్డ్ వీల్స్‌ను ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు.

అలాగే Akrapovic టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కూడా అదనపు ఆప్షన్‌గా అందిస్తున్నారు. కారు లోపలి భాగంలోనూ స్పోర్టీ లుక్‌ను కొనసాగించారు. బ్లూ R లోగో, కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో కూడిన స్పోర్ట్స్ సీట్లను అందించారు. R-Performance స్టీరింగ్ వీల్‌లో ప్యాడిల్ షిఫ్టర్లు, ప్రత్యేక R బటన్ ఉన్నాయి. అలాగే Digital Cockpit Pro డిస్‌ప్లేలో GPS ల్యాప్ టైమర్, యాక్సిలరోమీటర్, AWD టార్క్ డిస్ట్రిబ్యూషన్ వివరాలను చూసుకోవచ్చు. ఇవి ముఖ్యంగా స్పోర్ట్స్ డ్రైవింగ్‌ను ఇష్టపడేవారికి ఉపయోగపడతాయి.

కొత్త Volkswagen T-Roc Rను జర్మనీలో 59,995 యూరోల ప్రారంభ ధరతో ఆవిష్కరించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.62.51 లక్షలు. జర్మనీలో ఈ SUV ప్రీ-సేల్స్ ప్రారంభం కానున్నాయి. అయితే భారత మార్కెట్లో ఈ SUV విడుదలపై Volkswagen ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి భారతదేశంలో దీని లాంచ్ తేదీ, ధరపై స్పష్టత రావాల్సి ఉంది.