150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

Vinfast

Vinfast

VinFast Electric Scooters: వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్లో ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ టూవీలర్లకు పేటెంట్లు నమోదు చేసింది. దీనితో త్వరలోనే దేశంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది. భారత్ కోసం Evo, Kyo, Kinet అనే మూడు మోడళ్లను తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మూడు స్కూటర్లు విభిన్న డిజైన్లు, పనితీరు, ఫీచర్లతో వేర్వేరు వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు.

బ్యాటరీ స్వాపింగ్ సదుపాయం

VinFast తన స్వదేశమైన వియత్నాంలో బ్యాటరీ స్వాపింగ్ విధానంతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విజయవంతంగా విక్రయిస్తోంది. ఇదే విధానాన్ని భారత్‌లోనూ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. Evo, Kyo, Kinet స్కూటర్లలో తొలగించగలిగే బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. వినియోగదారులు వీటిని ఇంట్లో లేదా ఇతర ప్రాంతాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే కంపెనీ ఏర్పాటు చేసే బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లలో డిశ్చార్జ్ అయిన బ్యాటరీ స్థానంలో ఛార్జ్ అయిన బ్యాటరీని అమర్చుకోవచ్చు. పెట్రోల్ నింపుకున్నంత వేగంగా బ్యాటరీ మార్చుకునే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత.

VinFast Evo

ఈ మూడు మోడళ్లలో Evo అత్యంత అందుబాటు ధరలో లభించే స్కూటర్‌గా నిలవనుంది. రెట్రో స్టైలింగ్‌తో సరళమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి లేదా రెండు 1.5 kWh LFP బ్యాటరీ ప్యాక్‌లను అమర్చుకోవచ్చు. సింగిల్ బ్యాటరీ వెర్షన్ 85 కి.మీ., డ్యూయల్ బ్యాటరీ వెర్షన్ 150 కి.మీ. రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. వీటి గరిష్ఠ వేగం వరుసగా గంటకు 80 కి.మీ. సింగిల్ బ్యాటరీ మోడల్‌లో హబ్ మౌంటెడ్ మోటార్ 3 kW (4.02 bhp) పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్ బ్యాటరీ వెర్షన్‌లో 5.2 kW (7 bhp) పవర్ లభిస్తుంది. 0 నుంచి 50 కి.మీ. వేగాన్ని అందుకోవడానికి సింగిల్ బ్యాటరీ మోడల్‌కు 16 సెకన్లు, డ్యూయల్ బ్యాటరీ వెర్షన్‌కు సుమారు 6 సెకన్లు పడుతుంది. ఇందులో LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. రెండు బ్యాటరీలు అమర్చినప్పుడు సీటు కింద 12 లీటర్ల స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది.

VinFast Kyo

Kyo స్కూటర్ స్పోర్టీ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. స్టైలిష్ హెడ్‌ల్యాంప్, సైడ్ ప్యానెల్స్‌పై ప్రత్యేక గ్రాఫిక్స్ దీని ప్రధాన ఆకర్షణలు. ఇందులో రెండు 1.5 kWh తొలగించగల LFP బ్యాటరీలు ఉంటాయి. వీటితో 145 కి.మీ. రేంజ్ లభిస్తుంది. 3 kW హబ్ మోటార్ గరిష్ఠంగా 5.2 kW పవర్‌ను అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కి.మీ. 14 ఇంచుల వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. స్మార్ట్ కీ సిస్టమ్, TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 21 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కూడా అందించారు.

VinFast Kinet

మరింత స్పోర్టీ లుక్, మెరుగైన పనితీరు కోరుకునే వారి కోసం Kinet మోడల్‌ను రూపొందించారు. మ్యాక్సీ స్కూటర్ తరహా డిజైన్, పదునైన ఆకృతులతో కూడిన బాడీవర్క్, పెద్ద 14 ఇంచుల అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి. రెండు 1.5 kWh తొలగించగల LFP బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించారు. 5.2 kW సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌తో ఇది 145 కి.మీ. రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్‌లో 22 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ ఉంది. దీని బరువు 118 కిలోలు కాగా, Kyo బరువు 116 కిలోలు. ఈ రెండు మోడళ్లలోనూ 160 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్, 20 డిగ్రీల గ్రేడబిలిటీ, కీలెస్ గో ఫీచర్ ఉన్నాయి.