Top 3 Scooters of 2025: ఈ ఏడాది స్కూటర్ అభిమానులకు ప్రత్యేకంగా నిలిచింది. స్టైల్, పనితీరు, మంచి ఫీచర్స్ కలిగిన టాప్ 3 స్కూటర్లు ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచాయి. ఎలక్ట్రిక్ టెక్నాలజీ నుంచి టూరింగ్‌కు సరిపోయే డిజైన్ వరకూ, ఆధునిక రైడర్ల అవసరాలకు ఈ మోడళ్లు సరిపోయేలా వచ్చాయి. ఈ మూడు స్కూటర్లు ఏవి? దాని ఫీచర్స్, ధర తదితర అంశాల గురించి తెలుసుకుందాం..
READ MORE: Ukraine-Russia: ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందానికి అడుగులు.. రేపటి భేటీపై సర్వత్రా ఉత్కంఠ!
కినెటిక్ డీఎక్స్ ఈవీ
1980, 1990 దశకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన కినెటిక్ హోండా డీఎక్స్ స్కూటర్‌ను ఇది గుర్తు చేసింది. కొత్తగా డిజైన్ చేసిన ఈ స్కూటర్ డీఎక్స్, డీఎక్స్+ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. డీఎక్స్ ధర రూ.1,11,499 కాగా, డీఎక్స్+ ధర రూ.1,17,499 (ఎక్స్-షోరూమ్). ఇందులో 4.8 కిలోవాట్ పీక్ పవర్ ఇచ్చే హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటర్ ఉంది. ఫ్లోర్‌బోర్డ్ కింద అమర్చిన 2.6 kWh ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ దీనికి శక్తినిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే బేస్ వేరియంట్ 102 కిలోమీటర్లు, టాప్ వేరియంట్ 116 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.
హీరో జూమ్ 160
హీరో జూమ్ 160 స్కూటర్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. మస్క్యులర్ బాడీ, ఎత్తైన విండ్స్‌క్రీన్, సింగిల్ పీస్ సీట్, డ్యూయల్-చాంబర్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్ దీని ప్రత్యేకత. అదనంగా ఎత్తైన విండ్స్‌క్రీన్, టూరింగ్ బాక్స్‌ను యాక్సెసరీస్‌గా కొనుగోలు చేయొచ్చు. ఈ స్కూటర్ పొడవు 1983 ఎంఎం, వెడల్పు 772 ఎంఎం, సీట్ ఎత్తు 787 ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 155 ఎంఎం. ఇది ప్రస్తుతం ఇండియాలో మ్యాట్ రైన్‌ఫారెస్ట్ గ్రే, సమిట్ వైట్, క్యానియన్ రెడ్, మ్యాట్ వోల్కానిక్ గ్రే వంటి నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది.
హీరో జూమ్ 160లో 156 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 8,000 ఆర్‌పీఎం వద్ద 14.6 బిహెచ్‌పీ పవర్, 6,500 ఆర్‌పీఎం వద్ద 14 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 142 కిలోల బరువు ఉన్న ఈ స్కూటర్ లీటర్‌కు సుమారు 40 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ ఫీచర్లతో ఇది యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీగా నిలుస్తుంది. హీరో జూమ్ 160 ధరలు రూ.1.36 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతాయి.
విదా వీఎక్స్2
హీరో విడా వీఎక్స్2 స్కూటర్ 2.2 kWh, 3.4 kWh బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది. విడా వీఎక్స్2 గో వేరియంట్‌లో చిన్న బ్యాటరీ ప్యాక్ ఉండి, గరిష్ఠంగా 92 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. వీఎక్స్2 ప్లస్ వేరియంట్‌లో 3.4 kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్‌తో 142 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ స్కూటర్ వీఎక్స్2 ప్లస్, వీఎక్స్2 గో అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ప్లాన్‌తో చూస్తే ధరలు వరుసగా రూ.57,990, రూ.44,990. BaaS లేకుండా కొనుగోలు చేస్తే వీఎక్స్2 ప్లస్ ధర రూ.94,800, వీఎక్స్2 గో ధర రూ.73,850 (అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలే). విడా వీఎక్స్2 కోసం BaaS ప్లాన్ కిలోమీటర్‌కు రూ.0.96 నుంచి ప్రారంభమవుతుంది.
