Tesla Model Y 2026 Launched in India: అమెరికా దిగ్గజ సంస్థ టెస్లా భారత్‌లో తన పాపులర్ ప్రీమియం కార్ అయిన ‘టెస్లా మోడల్ వై’ (Tesla Model Y) ధరలను సవరిస్తూ, సరికొత్త “మోడల్ వై 2026″ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర మునుపటి కంటే ఏకంగా రూ.9 లక్షలు తగ్గిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ కారు బేస్ వేరియంట్ అయిన ‘రియర్ వీల్ డ్రైవ్’ ప్రారంభ ధర రూ.59.89 లక్షలుగా ఉండగా, ఇప్పుడు దానిని రూ.50.89 లక్షలకు తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్‌గా నిలిచినప్పటికీ, భారత మార్కెట్లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో అద్భుతాలు చేయలేకపోయిన ఈ కారు.. 5-సీటర్, 6-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. దీని డెలివరీలు జూలై 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. బేస్ 5-సీటర్ ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్‌లో 64kWh బ్యాటరీతో వస్తోంది. ఇది 299 HP పవర్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేస్తుంది. కాగా, దీని ‘లాంగ్ రేంజ్’ వేరియంట్‌లో 84.2kWh పెద్ద బ్యాటరీని అందించారు. ఈ ఏడాది ప్రారంభంలో రూ.67.89 లక్షల ధరతో లాంచ్ అయిన ఈ లాంగ్ రేంజ్ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.
ఇక కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన లాంగ్ వీల్‌బేస్ వేరియంట్ ‘టెస్లా మోడల్ వై ఎల్’ (Model Y L) ప్రారంభ ధర రూ.61.99 లక్షలుగా ఉంది. అంటే, బేస్ మోడల్ వై కారు ఈ కొత్త లాంగ్ వీల్‌బేస్ వేరియంట్ కంటే దాదాపు రూ.11.1 లక్షలు చౌకగా లభిస్తోంది. ఈ ‘మోడల్ వై ఎల్’ వేరియంట్‌లో ఎక్కువ స్పేస్, సీట్లు, అత్యధిక రేంజ్‌తో పాటు ‘ఆల్ వీల్ డ్రైవ్’ ఫీచర్ సైతం లభిస్తుంది. అంతేకాదు.. టెస్లా మోడల్ వై కారు సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్‌ను ఇస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తోనే దీనిని 238 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. అంతేకాదు, ఈ కారు కేవలం 5.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 19-ఇంచుల వీల్స్‌తో వచ్చే ఈ ఎస్‌యూవీ (SUV) లో టెక్స్చర్డ్ ఫినిషింగ్ గల ఇంటీరియర్ ఉంటుంది. కారు ముందు భాగంలో 16-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్, మొదటి వరుసలో పవర్ రెక్లైనింగ్, పవర్ టిల్ట్, హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు ఉండగా.. రెండవ వరుస సీట్లలో ఉన్నవారి కోసం ప్రత్యేకంగా 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. ఈ కారులో అద్భుతమైన సౌండ్ కోసం 9 స్పీకర్లు, భద్రత/నిఘా కోసం 8 కెమెరాలను అమర్చారు.
