Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్

  • టెస్లా మరో కొత్త ఉత్పత్తితో మార్కెట్లోకి
  • పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్
  • టెస్లా బ్యాలెన్స్ బైక్ ధర ఎంత?
Tesla Launches Pedal Free B

Tesla Launches Pedal Free B

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా మరో కొత్త ఉత్పత్తితో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈసారి కార్లు లేదా ఎలక్ట్రిక్ స్కూటర్లతో కాకుండా, చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పెడల్స్ లేని బ్యాలెన్స్ బైక్ ను విడుదల చేసింది. 2 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలు సైకిల్ తొక్కడం నేర్చుకునే ముందు సమతుల్యత (బ్యాలెన్స్) పెంపొందించేందుకు ఈ బైక్‌ను రూపొందించారు.

టెస్లా బ్యాలెన్స్ బైక్ ధర ఎంత?

టెస్లా ఈ కిడ్స్ బ్యాలెన్స్ బైక్‌ను 225 అమెరికన్ డాలర్లు ధరకు విడుదల చేసింది. భారతీయ కరెన్సీలో దీని ధర సుమారు రూ.19,000 ఉంటుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ బైక్‌కు భారీ డిమాండ్ ఏర్పడటంతో టెస్లా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం స్టాక్ అవుట్ అయింది.

2 నుంచి 5 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేకంగా

ఈ బ్యాలెన్స్ బైక్‌ను 2 నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న చిన్నారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇది 35 కిలోల వరకు బరువున్న పిల్లలను మోయగల సామర్థ్యం కలిగి ఉంది. తేలికైన మెగ్నీషియం ఫ్రేమ్ ఉండటంతో పిల్లలు సులభంగా నియంత్రించగలుగుతారు.

సర్దుబాటు చేసుకునే సీటు

పిల్లల ఎత్తుకు అనుగుణంగా ఈ బైక్ సీటును ఐదు వేర్వేరు ఎత్తుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పిల్లల ఎదుగుదలకు అనుగుణంగా కొంతకాలం వరకు అదే బైక్‌ను ఉపయోగించవచ్చు.

మోటార్, పెడల్స్ లేవు

ఈ బైక్‌లో ఎలాంటి మోటార్ లేదా పెడల్స్ ఉండవు. పిల్లలు తమ కాళ్లతో నేలను తట్టి బైక్‌ను ముందుకు నడిపిస్తారు. దీంతో వారికి సహజంగానే బ్యాలెన్స్, స్టీరింగ్ నియంత్రణ, దిశ మార్చడం వంటి నైపుణ్యాలు అలవడతాయి. అనంతరం సాధారణ సైకిల్‌ను సులభంగా నేర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

టెస్లా స్టైలిష్ డిజైన్

ఈ బైక్ టెస్లా ప్రత్యేకమైన మినిమలిస్ట్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. బైక్ పక్క భాగంలో టెస్లా బ్రాండింగ్, ముందు భాగంలో కంపెనీ ప్రసిద్ధ “T” లోగో ఉంటుంది. ఇంట్లోనే సులభంగా అమర్చుకునేలా అవసరమైన అన్ని అసెంబ్లీ టూల్స్‌ను కూడా కంపెనీ బాక్స్‌లో అందిస్తోంది.

డెలివరీ ఎప్పుడు?

టెస్లా తెలిపిన వివరాల ప్రకారం, ఈ బ్యాలెన్స్ బైక్ డెలివరీలు ఆగస్టు నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ ప్రొడక్ట్ అమెరికా మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.