Tata Curvv Series X Launched: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తన కూపే SUV కర్వ్ సిరీస్ X కొత్త శ్రేణిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుత స్టాండర్డ్ కర్వ్ స్థానంలో ఈ కొత్త సిరీస్ అందుబాటులోకి రానుంది. తక్కువ వేరియంట్లలోనే అధిక వేరియంట్లకు చెందిన ఫీచర్లను అందిస్తూ వినియోగదారులకు మరింత విలువను అందించడమే లక్ష్యంగా టాటా ఈ సిరీస్‌ను రూపొందించింది. ఇక్కడ ‘X’ అంటే ‘ఎక్స్‌ట్రా’ అని కంపెనీ పేర్కొంది.
ఆరు వేరియంట్లలో కర్వ్ సిరీస్ X
టాటా కర్వ్ సిరీస్ X మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. స్మార్ట్ X, ప్యూర్ X, ప్యూర్ X ప్లస్, క్రియేటివ్ X ప్లస్, అకాంప్లిష్ X, అకాంప్లిష్ X ప్లస్ వేరియంట్లు ఉన్నాయి. ఈ SUVను ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే, నైట్రో క్రిమ్సన్, ఒపెరా బ్లూ, అబ్సిడియన్ బ్లాక్ అనే ఐదు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
రూ.9.99 లక్షల నుంచి ధర
కర్వ్ సిరీస్ X స్మార్ట్ X వేరియంట్ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ప్యూర్ X వేరియంట్ ధర రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ అకాంప్లిష్ X ప్లస్ వేరియంట్ ధర రూ.18.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీని డార్క్ ఎడిషన్ ధర రూ.18.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
అదనపు ఫీచర్లతో ఆకట్టుకునే కారు
సిరీస్ Xలో తక్కువ వేరియంట్ల నుంచే అదనపు ఫీచర్లను అందిస్తున్నారు. ప్యూర్ X వేరియంట్ నుంచి 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ లభిస్తుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, ఆటో-ఫోల్డింగ్ ORVMలు ఉన్నాయి. ఉన్నత వేరియంట్లలో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, ముందు-వెనుక USB పోర్టులు, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
విశాలమైన క్యాబిన్.. అధునాతన సౌకర్యాలు
కారు క్యాబిన్‌లో లైట్ కలర్ ఇంటీరియర్ ఉండటంతో మరింత విశాలంగా కనిపిస్తుంది. వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేక AC వెంట్లు, రియర్ ఆర్మ్‌రెస్ట్, రిక్లైనింగ్ రియర్ సీట్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, బ్లైండ్-వ్యూ మానిటర్, రెయిన్-సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ కూడా అందిస్తున్నారు. ఇక, భద్రత విషయంలోనూ టాటా కర్వ్ సిరీస్ Xలో పలు ఫీచర్లు ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EPS, హిల్-హోల్డ్ కంట్రోల్, ABS, EBD, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
మూడు ఇంజన్ ఆప్షన్లు
కర్వ్ సిరీస్ Xలో ఇంజన్ ఆప్షన్ల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత కర్వ్ మాదిరిగానే ఈ కొత్త సిరీస్ కూడా మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరలోనే అధిక వేరియంట్ల ఫీచర్లను అందించడంతో కర్వ్ సిరీస్ X వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచే అవకాశం ఉంది.

