Aurus Senat: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతి విదేశీ పర్యటనలో చర్చకు వచ్చేది ఆయన భద్రత. ముఖ్యంగా ఆయన ప్రయాణించే “ఆరస్ సెనేట్ లిమోసిన్” కారు ప్రతి సారి వార్తల్లో నిలుస్తోంది. పుతిన్ భారత్ పర్యటనకు రానున్న వేళ, ఈ ప్రత్యేక వాహనాన్ని రష్యా నుంచి నేరుగా ప్రత్యేక కార్గో విమానంలో ఢిల్లీకి చేరవేయాలని నిర్ణయించారు. దీంతో ఈ కారు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. అంతర్జాతీయ వేదికలపై అనేక శక్తివంతమైన దేశాధినేతలు విలాసవంతమైన వాహనాలు ఉపయోగించినా, సెనేట్‌కు ఉన్న ప్రత్యేక వేరు.
ఆరస్ సెనేట్ లిమోసిన్ రూపకల్పనలో రష్యా సైనిక సాంకేతికత, ఆధునిక ఆటోమొబైల్ ఇంజినీరింగ్ రెండూ కలిశాయి. ఈ వాహనం బాహ్యంగా లిమోసిన్‌లా కనిపించినా, లోపల మాత్రం ఒక రక్షణ వ్యవస్థలా పనిచేస్తుంది. బాహ్య దాడులను తట్టుకునే శక్తి మాత్రమే కాదు.. రసాయన దాడులు, ఆవిరి దాడులు, పేలుళ్ల నుంచి రక్షిస్తుంది. ఒకవేళ ఈ వాహనం నీటిలో పడినా మునిగిపోకుండా గాలిరద్దు వ్యవస్థతో నీటిలో తేలియాడుతుందట. పుతిన్‌ను అనుసరించే వాహనాల కాన్వాయ్‌లో సెనేట్ కీలక పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ సమావేశాల్లో ముఖ్యంగా రక్షణ, దౌత్యప్రాధాన్యం ఉన్న వేడుకల్లో పుతిన్ ప్రయాణించే ఏకైక వాహనం ఇదే. ఇటీవల చైనాలో జరిగిన సమావేశంలో కూడా ప్రధాని మోడీతో కలిసి పుతిన్ ఇదే కారులో ప్రయాణించడం అంతర్జాతీయ దృష్టిని తీసుకువచ్చింది. ఈ వాహనం రష్యా ప్రతిష్టకు చిహ్నంగా నిలుస్తోంది. రష్యా రూపొందించిన స్వదేశీ అధునాతన వాహనం ప్రపంచ స్థాయి నాయకుల రక్షణలో కీలక పాత్ర పోషించడం మాస్కో టెక్నాలజీ శక్తిని కూడా ప్రతిబింబిస్తుంది.
READ MORE: TG Police Websites Hacked: పెరుగుతున్న హ్యాకింగ్ బెడద.. ఏకంగా పోలీస్ కమిషనరేట్స్ వెబ్‌సైట్స్ హ్యాక్
సెనాట్ శరీర నిర్మాణంలో విలాసం స్పష్టంగా కనిపిస్తుంది. బయటకు రాజసంగా, లోపల అగ్రశ్రేణి సౌకర్యాలతో రూపొందించిన ఇంటీరియర్ ప్రయాణించే నాయకుడికి పూర్తి సురక్షణతో పాటు సౌకర్యం కలగజేస్తుంది. అదనంగా, శక్తివంతమైన ఇంజిన్, వేగవంతమైన పనితీరు, అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఈ వాహనాన్ని సాధారణ లగ్జరీ కార్ల కంటే పూర్తిగా భిన్నంగా నిలబెడతాయి. ఎలాంటి దాడి జరిగినా.. కారు మాత్రం ఆగకుండా వేగంగా ముందుకు కదలుతుంది. ధర పరంగా చూస్తే, బేస్ మోడల్ కూడా ఎంతో ఖరీదైన వాహనం. అయితే పుతిన్ వ్యక్తిగత భద్రత కోసం చేర్చిన ప్రత్యేక పరికరాలు, అదనపు ఆర్మర్, కమ్యూనికేషన్ వ్యవస్థలు, అంతర్గత మార్పులతో అసలు విలువ మరింత పెరిగిపోయింది. ఈ కారు ధర సుమారుగా $275,000 (సుమారు ₹2.29 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. కానీ ఆ దేశం అధికారికంగా ఈ ధరను ప్రకటించలేదు.
