Traffic Rules: ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) పరిధిలో గాలి కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో అధికారులు ఆంక్షలను కఠినతరం చేశారు. పొల్యూషన్ అదుపు చేసేందుకు నోయిడా (Noida) లో గ్రాప్-3 (GRAP-III) నిబంధనలను అమలులోకి తెచ్చారు. దీనివల్ల నోయిడాలోకి ప్రవేశించే BS-III, BS-IV కేటగిరీ వాహనాలపై నిషేధం విధించారు. మీరు మీ పాత కార్లు (Cars) లేదా బైక్‌లు (Bikes) వేసుకుని నోయిడా రోడ్లపైకి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, ముందే మీ వెహికల్ ఎమిషన్ స్టాండర్డ్స్ (Emission Standards) ఏంటో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. నిబంధనలు ఉల్లంఘిస్తే మీ వాహనాన్ని సీజ్ చేసే అవకాశం కూడా ఉంది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టడానికే గౌతమ్‌బుద్ధ నగర్ (Gautam Buddh Nagar) జిల్లాలో ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రాఫిక్ డీసీపీ (DCP Traffic) సయ్యద్ అలీ అబ్బాస్ తెలిపారు. రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. గౌతమ్‌బుద్ధ నగర్లో దాదాపు 1 లక్ష BS-IV వాహనాలు, 51 వేలకు పైగా BS-III వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. అంటే ఈ కొత్త బ్యాన్ వల్ల సుమారు 1.5 లక్షల వాహనాల రాకపోకలపై ప్రభావం పడనుంది.
ఈ ఆంక్షలు పక్కాగా అమలు అయ్యేలా చూడటానికి నోయిడాలోని వివిధ కీలక ప్రాంతాల్లో 24 గంటలూ పహారా కాసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను (Monitoring Teams) రంగంలోకి దించారు. జెవర్ టోల్ ప్లాజా (Jewar Toll Plaza), జీరో పాయింట్, పరీ చౌక్, చిల్లా బోర్డర్, డిఎన్డి (DND Flyway) తో పాటు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. రోజువారీ పనుల కోసం ఢిల్లీ, ఆగ్రా, లక్నో, ఘాజియాబాద్, హాపూర్, బులంద్ షహర్, అలీగఢ్, ఫరీదాబాద్, పల్వాల్ వంటి నగరాల నుంచి వేలాది ప్రైవేట్, కమర్షియల్ వాహనాలు నోయిడాకు వస్తుంటాయి. అందుకే కాళింది కుంజ్, న్యూ అశోక్ నగర్, కొండ్లీ బోర్డర్ వంటి రద్దీ రూట్లలో బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి గౌతమ్‌బుద్ధ నగర్ మీదుగా ఢిల్లీ వైపు వెళ్లే వాహనాలను కూడా నిలిపివేస్తున్నారు. కేవలం నిబంధనలకు కట్టుబడి ఉన్న వాహనాలను మాత్రమే ముందుకు అనుమతిస్తున్నారు.
ప్రస్తుతానికి నిషేధిత కేటగిరీ వాహనాల్లో వస్తున్న డ్రైవర్లను ఆపి, అవసరమైన తనిఖీల తర్వాత హెచ్చరించి వదిలేస్తున్నారు. కానీ ఎవరైనా పదే పదే రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం వారి వాహనాలను సీజ్ చేస్తామని డీసీపీ హెచ్చరించారు. వాహనదారులంతా గ్రాప్-3 రూల్స్ పాటించాలని కోరారు. ఇక నోయిడా నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు కూడా ట్రాఫిక్ పోలీసులు ముఖ్యమైన సమాచారం అందించారు. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిటీ (CAQM) సవరించిన గ్రాప్ నిబంధనలు, ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. ఢిల్లీలో BS-VI కన్నా తక్కువ ఎమిషన్ స్టాండర్డ్ ఉన్న వాహనాల ఎంట్రీపై పూర్తి బ్యాన్ ఉంది. కేవలం BS-VI, సిఎన్జి (CNG), ఎలక్ట్రిక్ (Electric Vehicle), ఎల్ఎన్జి (LNG) వాహనాలకు మాత్రమే మినహాయింపులతో ఢిల్లీలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే BS-VI కంటే తక్కువ ప్రమాణాలు కలిగిన డీజిల్ బస్సులకు (Diesel Buses) కూడా ఢిల్లీలోకి ప్రవేశం లేదు.

