TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్‌, ఫీచర్లు..!

Tvs Jupiter Dual Tone Spect

Tvs Jupiter Dual Tone Spect

TVS Jupiter Dual Tone Spectral: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ కంపెనీ తన పాపులర్ స్కూటర్ జూపిటర్‌కు కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. TVS Jupiter Dual Tone Spectral పేరుతో వచ్చిన ఈ కొత్త సిరీస్‌లో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లతో పాటు పలు కొత్త ఫీచర్లను జోడించారు. 110cc ఇంజన్‌తో వచ్చే ఈ స్కూటర్ ధర రూ.90 వేల లోపే ఉండటం విశేషం.

ధర ఎంత?

కొత్త TVS Jupiter Dual Tone Spectral ఎక్స్‌షోరూమ్ ధర రూ.89,825గా నిర్ణయించారు. ఇది Spectral Blue, Spectral Copper Dual-Tone అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్ కొత్త జూపిటర్‌కు ప్రత్యేకమైన లుక్‌ను అందిస్తుంది. స్కూటర్‌లోని ఇంటీరియర్ ప్యానెళ్లు, సీటు ఫినిషింగ్‌లో మార్పులు చేశారు. పాక్షిక క్రోమ్ మిర్రర్లు కూడా కొత్త లుక్‌ను అందిస్తాయి. డ్యూయల్ టోన్ స్పెక్ట్రల్ కలర్ ఆప్షన్లతో వచ్చిన తొలి 110cc స్కూటర్‌గా కొత్త జూపిటర్‌ను TVS పేర్కొంటోంది.

సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు

కొత్త జూపిటర్‌లోని ప్రత్యేక ఆకర్షణల్లో సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు ఒకటి. సాధారణ ఇండికేటర్ల మాదిరిగా ఒకేసారి వెలగకుండా, క్రమంగా వెలిగేలా వీటిని రూపొందించారు. దీంతో స్కూటర్‌కు మరింత ప్రీమియం లుక్ వస్తుంది.

పెద్ద సీటు.. 33 లీటర్ల స్టోరేజ్
రైడర్, పిలియన్‌కు మెరుగైన సౌకర్యం అందించేందుకు కొత్త జూపిటర్‌లో ప్రీమియం లాంగ్ సీట్‌ను అందించారు. ఇద్దరికీ మెరుగైన సపోర్ట్ కోసం బ్యాక్ సపోర్ట్ కూడా ఉంది. సీటు కింద 33 లీటర్ల స్టోరేజ్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో రెండు హెల్మెట్లను కూడా ఉంచుకునే అవకాశం ఉందని TVS తెలిపింది.

USB Type-C, Bluetooth కనెక్టివిటీ
కొత్త జూపిటర్‌లో టెక్నాలజీ పరంగా కూడా పలు ఫీచర్లు ఉన్నాయి. Smart Connect Bluetooth టెక్నాలజీ ద్వారా నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్ వంటి సమాచారాన్ని స్కూటర్‌పై యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వేగంగా ఛార్జింగ్ చేసుకునేందుకు USB Type-C ఛార్జింగ్ పోర్ట్ను కూడా అందించారు.

61 కిలోమీటర్ల వరకు మైలేజ్
ఇంజన్ విషయానికి వస్తే కొత్త జూపిటర్‌లో ఇదే 113.3cc సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ కొనసాగించారు. ఈ ఇంజన్ గరిష్ఠంగా 7.9 hp పవర్, 9.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. TVS ప్రకారం ఈ స్కూటర్ లీటరుకు 61 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.

జూపిటర్‌కు భారీ డిమాండ్
TVS జూపిటర్ కంపెనీకి అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటి. తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో జూపిటర్ అమ్మకాలు 1,48,595 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇప్పుడు కొత్త డ్యూయల్ టోన్ కలర్స్, సీక్వెన్షియల్ ఇండికేటర్లు, మెరుగైన సీటు, USB Type-C, Bluetooth కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వచ్చిన కొత్త వెర్షన్‌ ద్వారా మరింత మంది కస్టమర్లను ఆకర్షించాలని TVS భావిస్తోంది.