Honda NX500 Launch: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్లో కొత్తగా NX500 అడ్వెంచర్ టూరర్ బైక్‌ను ఈ-క్లచ్ టెక్నాలజీతో లాంచ్ చేసింది. క్లచ్ లీవర్ ఉపయోగించకుండా గేర్ మార్చుకునే సౌకర్యం ఈ బైక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కాకపోతే డిజైన్, ఇంజిన్ లేదా ఇతర మెకానికల్ అంశాల్లో పెద్దగా మార్పులు చేయలేదు.
కొత్త హోండా NX500లో అందించిన ఈ-క్లచ్ సిస్టమ్ ప్రత్యేక ఎలక్ట్రానిక్ యాక్చ్యుయేటర్ల సహాయంతో పనిచేస్తుంది. గేర్ మార్చే సమయంలో క్లచ్‌ను ఆటోమేటిక్‌గా ఆపరేట్ చేస్తుంది. బైక్ పూర్తిగా ఆగినప్పుడు లేదా మళ్లీ స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ సిస్టమ్ సజావుగా పనిచేస్తుంది. అయితే రైడర్‌కు అవసరమైతే సాధారణ క్లచ్ లీవర్, గేర్ పెడల్ ఉపయోగించి మాన్యువల్‌గా కూడా గేర్ మార్చుకునే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ కారణంగా బైక్ బరువు 3 కిలోలు పెరిగి మొత్తం 199 కిలోలుగా మారింది. ఇటీవల హోండా CB650R, CBR650R మోడళ్లలో కూడా ఈ-క్లచ్ ఆప్షన్ అందించింది. అయితే ఆ మోడళ్లకు వచ్చిన డిమాండ్ కారణంగా మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడైపోయింది.
హోండా NX500 స్పెసిఫికేషన్లు:
హోండా NX500లో 471cc ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 8,500 rpm వద్ద 47 Hp, 6,500 rpm వద్ద 43 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. అయితే క్లచ్ వ్యవస్థను మాత్రమే ఈ-క్లచ్ టెక్నాలజీకి అనుగుణంగా మార్చారు. ఈ అడ్వెంచర్ టూరర్ బైక్ ముందు భాగంలో USD ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్‌ను అందించారు. బైకు ముందు 19 అంగుళాల వీల్, వెనుక 17 అంగుళాల అల్లాయ్ వీల్ ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో ట్విన్ 296 mm డిస్క్ బ్రేకులు, రేడియల్ మౌంటెడ్ నిస్సిన్ కాలిపర్స్‌ను ఉపయోగించారు. వెనుక భాగంలో 240 mm సింగిల్ డిస్క్ బ్రేక్ అందించారు. అదనంగా డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్ కూడా ఉంది.
అలాగే హోండా NX500లో 5 అంగుళాల TFT డిస్‌ప్లేను అందించారు. బలమైన స్విచ్‌గేర్ కూడా ఇందులో భాగంగా ఉంది. ఎలక్ట్రానిక్ రైడింగ్ ఫీచర్లలో డ్యూయల్ ఛానల్ ABS, స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్ మాత్రమే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇతర ప్రీమియం బైక్‌లలో కనిపించే రైడింగ్ మోడ్స్, అడ్వాన్స్‌డ్ గ్యాడ్జెట్స్ వంటి ఫీచర్లు ఇందులో లేవు. అలాగే ఈ బైక్‌లో కేబుల్ ఆపరేటెడ్ థ్రోటిల్‌ను ఉపయోగించడం గమనార్హం. ఈ బైక్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.44 లక్షలుగా నిర్ణయించారు.
