ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..

  • EICMA 2026లో..
  • హీరో మోటోకార్ప్‌కు చెందిన విడా బ్రాండ్ Project VXZ ఎలక్ట్రిక్ బైక్‌ ప్రదర్శన..
  • అమెరికాకు చెందిన జీరో మోటార్‌సైకిల్స్ భాగస్వామ్యంతో కలిసి అభివృద్ధి..
Hero Vida Vxz

Hero Vida Vxz

Hero VIDA VXZ Electric Bike: హీరో మోటోకార్ప్ నుండి వచ్చిన ఎలక్ట్రిక్ వాహన విభాగం విడా (VIDA) నుంచి మరో ఆసక్తికరమైన ఎలక్ట్రిక్ బైక్‌ను ఇటలీలో జరుగుతున్న EICMA 2026 ప్రదర్శనలో VIDA Project VXZ పేరుతో ప్రదర్శించింది. అమెరికాకు చెందిన జీరో మోటార్‌సైకిల్స్ (Zero Motorcycles) భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. తొలిసారిగా 2025 EICMAలో కాన్సెప్ట్ రూపంలో పరిచయమైన ఈ బైక్.. తాజాగా కొత్త రంగులు, మరిన్ని వివరాలతో మరోసారి ఆకట్టుకుంది.

స్పోర్టీ డిజైన్‌

VIDA Project VXZ డిజైన్‌లో స్పోర్టీ స్ట్రీట్‌ఫైటర్ స్టైలింగ్ కనిపిస్తుంది. పింక్, పర్పుల్ కలర్ కాంబినేషన్‌తో పాటు ప్రత్యేకమైన గ్రాఫిక్స్ ఈ బైక్‌కు కొత్త రూపాన్ని అందిస్తున్నాయి. ఇందులో యాంగ్యులర్ బాడీ ప్యానెల్స్, సెంట్రల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, చిన్న టింటెడ్ ఫ్లైస్క్రీన్, వెడల్పాటి హ్యాండిల్‌బార్ ఉన్నాయి. రైడర్, పిలియన్ కోసం ప్రత్యేక సీట్లు, పైకి లేచిన టెయిల్ సెక్షన్, సన్నని రియర్ లైటింగ్ అసెంబ్లీని అందించారు. బైక్ పైభాగంలో సాధారణ పెట్రోల్ ట్యాంక్ తరహా డిజైన్ ఉన్నప్పటికీ, అందులో ఛార్జింగ్ కనెక్టర్‌ను అమర్చారు.

బెల్ట్ డ్రైవ్, ఛార్జింగ్ పోర్ట్

ఈ బైక్‌లో కనిపించిన ముఖ్యమైన అంశాల్లో బెల్ట్ డ్రైవ్ ఒకటి. స్వింగార్మ్ పివట్‌కు సమీపంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ నుంచి వెనుక చక్రానికి బెల్ట్ ద్వారా శక్తి అందుతుంది. అలాగే పైభాగంలోని కవర్‌ను తెరిస్తే ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తుంది. అయితే ఛార్జింగ్ స్టాండర్డ్, ఆన్‌బోర్డ్ ఛార్జర్ సామర్థ్యం, ఛార్జింగ్ వేగం వంటి వివరాలను హీరో ఇంకా వెల్లడించలేదు. బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్, టార్క్, కూలింగ్ సిస్టమ్ వివరాలు కూడా ప్రకటించాల్సి ఉంది.

అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, డిస్క్ బ్రేకులు

హార్డ్‌వేర్ పరంగా Project VXZలో ముందు భాగంలో అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్ (USD Forks), వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు, అల్లాయ్ వీల్స్ అందించారు. ముందు భాగంలో ByBre బ్రాండెడ్ కాలిపర్‌ను గుర్తించవచ్చు. అలాగే ABS టోన్ రింగ్ కూడా కనిపిస్తోంది. ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేలో ABS, ట్రాక్షన్ కంట్రోల్‌కు సంబంధించిన సూచికలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రొడక్షన్ మోడల్‌లో కూడా ఉంటాయా లేదా అనేది కంపెనీ స్పష్టం చేయలేదు.

188 కిలోమీటర్ల రేంజ్

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో పెద్ద కలర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో స్పోర్ట్ మోడ్, పార్కింగ్ ఫంక్షన్, బ్యాటరీ స్థాయి, అంచనా రేంజ్ వంటి వివరాలు కనిపిస్తున్నాయి. స్విచ్‌గేర్‌లో హజార్డ్ బటన్, మోడ్ సెలెక్టర్, SOS బటన్ కూడా ఉన్నాయి. ప్రదర్శనలో చూపించిన ఒక డిస్‌ప్లేలో 80% బ్యాటరీ ఛార్జింగ్‌తో 150 కిలోమీటర్ల రేంజ్ మిగిలి ఉన్నట్లు కనిపించింది. దీన్ని బట్టి పూర్తి ఛార్జింగ్‌పై సుమారు 188 కిలోమీటర్ల రేంజ్ రావచ్చని అంచనా. అయితే ఇది కంపెనీ అధికారికంగా ప్రకటించిన రేంజ్ కాదు. ప్రస్తుతం Hero VIDA Project VXZ కాన్సెప్ట్ దశలోనే ఉంది. దీని బ్యాటరీ, మోటార్ పనితీరు, పూర్తి ఫీచర్లు, ధర, మార్కెట్లో విడుదల తేదీపై హీరో మోటోకార్ప్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. EICMA 2026లో ప్రదర్శించిన ఈ మోడల్ ఉత్పత్తి దశకు చేరుకుంటే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలో హీరోకు మరో కీలకమైన మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది.