Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్‌ఫామ్, స్మార్ట్ ఫీచర్లు

  • ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
  • 2026 ఆగస్టు 29న అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది
  • EL01 కాన్సెప్ట్‌ను పోలిన డిజైన్
Ather

Ather

భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ప్రముఖ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) కొత్త తరం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. కంపెనీ అభివృద్ధి చేసిన సరికొత్త EL ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన తొలి ప్రొడక్షన్ స్కూటర్‌ను 2026 ఆగస్టు 29న అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ స్కూటర్ రోడ్లపై పరీక్షల సమయంలో కనిపించడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. కొత్త డిజైన్, అధునాతన టెక్నాలజీ, స్మార్ట్ ఫీచర్లతో ఈ స్కూటర్ మార్కెట్లోకి రానుందని భావిస్తున్నారు.

EL01 కాన్సెప్ట్‌ను పోలిన డిజైన్

టెస్టింగ్ సందర్భంగా కనిపించిన చిత్రాలను బట్టి, ఈ కొత్త స్కూటర్ 2025లో ఆవిష్కరించిన EL01 కాన్సెప్ట్ డిజైన్‌ను ఎక్కువగా అనుసరిస్తుందని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో దీనికి సంబంధించిన డిజైన్ పేటెంట్‌ను కూడా కంపెనీ దాఖలు చేసింది. స్కూటర్ ముందు భాగంలో హ్యాండిల్‌బార్‌పై అమర్చిన హెడ్‌లైట్, అలాగే వెడల్పాటి LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs) ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తున్నాయి.

కొత్త EL ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత

ఏథర్ 450 సిరీస్ తర్వాత కంపెనీ తీసుకొస్తున్న మొదటి పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ EL ప్లాట్‌ఫామ్. భవిష్యత్తులో విడుదలయ్యే కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లన్నీ ఇదే ప్లాట్‌ఫామ్‌పై రూపొందనున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన స్కూటర్ల ధర రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా. దీంతో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఇతర బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వాలని ఏథర్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇన్ఫినిట్ క్రూజ్ ఫీచర్

ఏథర్ ఇప్పటికే తన 450X, 450 Apex మోడళ్లలో Infinite Cruise ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జనవరి 2025 తర్వాత విడుదలైన పాత మోడళ్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా పొడవైన రహదారులపై అధిక వేగంతో ప్రయాణించడం సులభం. గుట్టలు, ఎత్తుపల్లాల మార్గాల్లో తక్కువ వేగంతో కూడా మెరుగైన నియంత్రణ లభిస్తుంది. కొండ ప్రాంతాల్లో రైడింగ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

‘Voice on Ather’ స్మార్ట్ టెక్నాలజీ

కొత్త స్కూటర్‌లో ‘Voice on Ather’ అనే వాయిస్ కమాండ్ ఫీచర్ కూడా ఉండనుంది. ఈ ఫీచర్ ద్వారా రైడర్లు.. వాయిస్‌తోనే నావిగేషన్ ప్రారంభించవచ్చు. సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్లను గుర్తించవచ్చు. స్కూటర్‌లోని ముఖ్యమైన ఫంక్షన్‌లను చేతులు ఉపయోగించకుండా నియంత్రించవచ్చు. ఈ స్కూటర్‌తో పాటు Ather Halo Smart Helmet కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈ స్మార్ట్ హెల్మెట్

మొబైల్ ఫోన్, స్కూటర్ డాష్‌బోర్డ్, హెల్మెట్‌ను ఒకే ఎకోసిస్టమ్‌లో అనుసంధానిస్తుంది.
ఇయర్‌ఫోన్లు అవసరం లేకుండానే స్పష్టమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది.
నావిగేషన్, కాల్స్, వాయిస్ కమాండ్లను మరింత సులభంగా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తుంది.

మార్కెట్లో గట్టి పోటీ

కొత్త EL ప్లాట్‌ఫామ్‌తో ఏథర్ తక్కువ ధరలో ఆధునిక ఫీచర్లను అందించేందుకు సిద్ధమవుతోంది. దీంతో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో Ola Electric, TVS iQube, Bajaj Chetak వంటి మోడళ్లకు ఈ కొత్త ఏథర్ స్కూటర్ గట్టి పోటీ ఇవ్వొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.