Ather Konarc EV: పెట్రోల్ వెహికల్స్‌కు గుడ్‌బై చెబుతూ క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు రోజువారీ ప్రయాణాల కోసం చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఈ ఏడాది తన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే ఏథర్ కోనార్క్. విడుదలైన కొద్ది నెలల్లోనే ఈ స్కూటర్ అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేస్తోంది.
అక్టోబర్‌లో ఏథర్ అమ్మకాలు అదుర్స్!
ఏథర్ ఎనర్జీకి అక్టోబర్ 2026 మంచి ఫలితాలను అందించింది. ఈ నెలలో కంపెనీ మొత్తం 33,786 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. గతేడాది అక్టోబర్‌లో నమోదైన 25,829 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 30.8 శాతం వృద్ధిని సాధించింది. నెలవారీ అమ్మకాల్లోనూ కంపెనీ మంచి పురోగతి సాధించింది. సెప్టెంబర్ 2026లో 30,121 యూనిట్లు విక్రయించగా.. అక్టోబర్‌లో 12.2 శాతం వృద్ధి నమోదైంది. ఈ గణాంకాలతో ఈవీల వైపు ప్రజలు ఎలా మొగ్గు చూపుతున్నారో తెలుసుకోవచ్చు..
ఒక్క నెలలో 83 శాతం పెరిగిన కోనార్క్ అమ్మకాలు!
ఏథర్ ఇటీవల విడుదల చేసిన కోనార్క్ స్కూటర్ అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. కంపెనీ ఆగస్టు చివరిలో ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆటో పండిట్స్ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్‌లో 4,140 యూనిట్లు అమ్ముడుపోయాయి.. ఇక, అక్టోబర్‌లో ఏకంగా 7,562 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. దీంతో ఒక్క నెలలోనే అమ్మకాలు 83 శాతం పెరిగాయి. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడవుతున్న రెండో స్కూటర్‌గా కోనార్క్ నిలిచింది. ఏథర్ పోర్ట్‌ఫోలియోలో రిజ్టా అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా కొనసాగుతోంది. అక్టోబర్ 2026లో ఈ మోడల్ 19,505 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇక ఏథర్ 450 మోడల్ 6,719 యూనిట్లు విక్రయించింది. దీంతో కోనార్క్ కూడా కంపెనీ అమ్మకాల వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.
కోనార్క్ ప్రత్యేకతలు ఏమిటి?
ఏథర్ కోనార్క్ కంపెనీ సరికొత్త EL ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఆగస్టు చివరిలో నిర్వహించిన కమ్యూనిటీ డే కార్యక్రమంలో దీనిని ఆవిష్కరించారు. కంపెనీ అత్యంత సరసమైన స్కూటర్‌గా నిలిచిన కోనార్క్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.99,999గా నిర్ణయించారు. ఈ స్కూటర్‌ను S-సిరీస్, Z-సిరీస్ అనే రెండు సిరీస్‌లలో ప్రకటించారు. అయితే అన్ని వేరియంట్ల అమ్మకాలు, డెలివరీలు ఇంకా ప్రారంభంకావాల్సి ఉంది..
200 కిలోమీటర్ల వరకు రేంజ్.. అదిరిపోయే ఫీచర్లు!
ఏథర్ కోనార్క్ గరిష్టంగా 200 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే S-సిరీస్ వేరియంట్ గరిష్ట రేంజ్ 161 కిలోమీటర్లుగా ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 7 అంగుళాల TFT డిస్ప్లే అందించారు. బేస్ వేరియంట్లో మాత్రం చిన్న డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ ద్వారా టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్స్, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి సదుపాయాలు పొందవచ్చు. అంతేకాకుండా OTA అప్డేట్స్, రిమోట్ ఛార్జింగ్ స్టేటస్, దొంగతనం హెచ్చరిక వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. పలు సదుపాయాలను అందించే స్మార్ట్ కీ కూడా ఈ స్కూటర్ ప్రత్యేకతగా నిలుస్తోంది. తక్కువ ధరలో ఆధునిక ఫీచర్లు, మెరుగైన రేంజ్ కోరుకునే వినియోగదారులను కోనార్క్ ఆకర్షిస్తోంది. అందుకే విడుదలైన కొద్ది నెలల్లోనే ఈ స్కూటర్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి చెబుతున్నారు మార్కెట్ నిపుణులు..

