వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం చీపురుపల్లి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గరివిడి మండల కేంద్రంలోని బొత్స సత్యనారాయణ గారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాలకు డాక్టర్ బొత్స అనూష కీలకంగా నేతృత్వం వహించారు. కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, మాట ఇస్తే మడమ తిప్పని నేతగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేదల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని అన్నారు. బలహీన వర్గాలకు విస్తృతంగా సంక్షేమ పథకాలు అందించి మనసున్న మహారాజుగా ప్రజల అభిమానాన్ని పొందారని తెలిపారు. మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్నారు.
డాక్టర్ బొత్స అనూష మాట్లాడుతూ, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనలో పేదల జీవితాల్లో వచ్చిన మార్పులు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్యకు వెళ్లడం సంతోషంగా ఉందని, జగనన్న మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రక్తదాన శిబిరానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు డాక్టర్ బొత్స అనూష ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం పార్టీ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని ఆమె అన్నారు.
