Water Level Increased In Dhavaleshwaram Project: గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గోదావరికి మళ్లీ వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల.. ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు గోదావరిలోకి చేరుతోంది. దీంతో.. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ప్రాజెక్టులో నీటిమట్టం మొదటి హెచ్చరికకు చేరువగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజి వద్ద 11.20 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజికి సంబంధించిన 175 గేట్లు ఎత్తేసి.. 9 లక్షల 9 వేల క్యూసెక్కుల వరద నీరుని సముద్రంలోకి విడుదల చేశారు. కాసేపట్లోనే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే ఏపీ విపత్తుల సంస్థ వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసింది. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండీ డా. బీఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, ప్రయాణం లాంటివి చేయరాదని సూచించారు. కాగా.. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలో వరుసగా మూడుసార్లు గోదావరికి వరద వచ్చింది.