Tirumala Adulterated Ghee Case: తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంలో సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఇప్పటివరకు 36 మందిని నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు.. వారిలో కొందరిని అరెస్టు చేశారు. మిగిలినవారికి నోటీసులు జారీ చేసి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. కల్తీ నెయ్యికి అనుమతులివ్వడంలో టీటీడీలోని కీలక అధికారులు, డెయిరీ నిపుణులు సూత్రధారులుగా వ్యవహరించారని సిట్ దర్యాప్తులో తేలింది. ఆ సమయంలో టిటిడి బోర్డు చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డిని, బోర్డు సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా కొందరిని విచారించింది సిట్. తాజాగా కేసులో A-34గా ఉన్న విజయభాస్కర్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. సిట్ తరఫున అసిస్టెంట్ పీపీ జయశేఖర్ వాదనలు వినిపించగా పీపీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. విజయ్‌భాస్కర్‌రెడ్డి చేసిన అక్రమాలను కోర్టులో అసిస్టెంట్ పీపీ వివరించారు. నెయ్యి కంపెనీల పనితీరు బాగా లేకున్నా అనుకూలంగా నివేదిక ఇచ్చారని సిట్ గుర్తించిందని ఏపీపీ తెలిపారు. 2023లో భోలేబాబా కంపెనీ నుంచి 75 లక్షలు తీసుకున్నట్లు సిట్ గుర్తించిందని తెలిపారు. ప్రీమియర్ కంపెనీ నుంచి 8 లక్షలు లంచం తీసుకున్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైందన్నారు. భాస్కర్‌రెడ్డి నివేదికతో టీటీడీకి 118 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కోర్టుకు తెలిపింది సిట్. లంచం తీసుకున్నట్లు విజయ్‌భాస్కర్‌రెడ్డి అంగీకరించారని అసిస్టెంట్ పీపీ కోర్టుకు తెలిపారు. అలానే విజయ్‌భాస్కర్‌రెడ్డి నుంచి 34 లక్షల రూపాయలను సిట్ సీజ్ చేసిందని కోర్టుకు వివరాలు సమర్పించారు.
Read Also: Ravi Teja: నెక్ట్స్ సినిమా డైరెక్టర్‌ను అనౌన్స్ చేసిన మాస్ మహారాజా ..
కల్తీ నెయ్యి కేసు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో తిరుపతి సిట్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష జరిపారు సిబిఐ జెడి. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు, కేసుకు సంబంధించిన ఫైల్స్‌ని పరిశీలించారు సీబీఐ జేడీ వీరేశ్ ప్రభు. గుంటూరు రేంజి ఐజి సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, FSSAI సలహాదారు డా. సత్యేన్ కూమార్ పాండా, డీఐజీ మురళీ రాంబా, విశాఖ రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టీలతో కేసు వివరాలపై చర్చించారు. త్వరలోనే సిట్ దర్యాప్తు ముగిసే అవకాశం కనిపిస్తోంది. సంక్రాంతి తర్వాత వారం లేదంటే ఈ నెలాఖరులోగా నెల్లూరు ఎసిబి కోర్టులో మలివిడత ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది సిట్. దాంతోపాటు మరికొందరు కీలక వ్యక్తులను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వారి అరెస్టు తర్వాతే పూర్తిస్థాయి చార్జిషీటును కోర్టుకు సమర్పించడమే కాకుండా దర్యాప్తు వివరాలను సుప్రీంకోర్టుకు స్టీల్ కవర్‌లో నివేదిక ఇవ్వనుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. తాజాగా జరిగిన సిబిఐ జేడీ, సిట్ అధికారుల సమావేశంలోనూ ఇదే విషయంపై చర్చ జరిగినట్టు సమాచారం.
