CM Chandrababu: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమాజంలో ప్రతీ ఒక్కరికీ సమాన అవకాశాలు, గౌరవం, జీవన ప్రమాణాల మెరుగుదల అందించాలని లక్ష్యంగా, ఇంద్రధనుస్సు తరహాలో ఏడు వరాలు ప్రకటించారు.
1. దివ్యాంగులకు APSRTC ఉచిత ప్రయాణం: ఇప్పటివరకు మహిళలకు మాత్రమే అందుతున్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఇకపై దివ్యాంగులకు కూడా వర్తింపచేస్తామని సీఎం ప్రకటించారు.
2. స్థానిక సంస్థల్లో దివ్యాంగుల ప్రతినిధిత్వం: స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు మరియు పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం ఒక్క దివ్యాంగ ప్రతినిధిని తప్పనిసరిగా నామినేట్ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
3. ఆర్థిక సబ్సిడీ పథకాల పునరుద్ధరణ: SC, ST, BC మరియు మైనారిటీలకు ఇచ్చినట్లే, దివ్యాంగులకు కూడా ఆర్థిక సబ్సిడీ పథకాలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
4. క్రీడా కార్యక్రమాల్లో దివ్యాంగులకు అవకాశాలు: SAAP (Sports Authority of Andhra Pradesh) ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని క్రీడా కార్యక్రమాలు, ప్రతిభాభివృద్ధి పథకాలు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు.
5. హౌసింగ్ ప్రాజెక్టుల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు: బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ గృహ నిర్మాణాల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్‌ను తప్పనిసరిగా కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
6. ప్రత్యేక డిగ్రీ కాలేజీ & పెన్షన్ పంపిణీ: బాపట్లలో ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ స్థాపించనున్నారు.
అలాగే, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్‌లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు అదే చోటే సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేసే విధానం అమలు కానుంది.
7. అమరావతిలో రాష్ట్ర స్థాయి ‘దివ్యాంగ్ భవన్’: దివ్యాంగుల కోసం రాష్ట్ర స్థాయిలో అన్ని సేవలు, మద్దతు కార్యక్రమాలు, శిక్షణా కేంద్రాలు, హక్కుల పరిరక్షణ సేవలను ఒకే చోట అందించేలా ‘దివ్యాంగ్ భవన్’ ని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు.
