ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మంగళవారం గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరులో గల గార్డెన్స్‌లోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలు వజ్రోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయకుడు మాట్లాడుతూ.. పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల ఎందరో సమర్థులను దేశానికి అందించిందని ఆయన అన్నారు. ఎంతో ముందుచూపుతో అప్పట్లో సీతారామయ్య ఈ పాఠశాలను ఏర్పాటు చేశారని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దని విద్య నిరుపయోగమని మహాత్మా గాంధీ అన్నారని, సమాజంలో రోజురోజుకూ విలువలు తగ్గుతున్నాయని అన్నారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి విడగొడుతున్నారని, నాయకులే ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం బాధాకరమన్నారు.
చట్ట సభల్లోనే బూతులు, అసభ్య పదజాలం వాడటం దారుణమని, కులం, మతం, నేర ప్రవృత్తి, డబ్బు ప్రధానమైపోవటం దారుణమని ఆయన మండిపడ్డారు. ఇతరుల కోసం జీవిస్తే చాలాకాలం జీవిస్తావని మన భారతీయ ధర్మం చెబుతోందని, అలా సమాజం కోసం పాడుపడిన వారిని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారు. కానీ కొందరు విద్య , వైద్యం ను వ్యాపారంగా చేసుకుని డబ్బు సంపాదిస్తున్నారన్నారు. దేశానికి నాయకత్వం వహించే సమర్థులను తయారు చేయటం కూడా విద్య లక్ష్యమని ఆయన అన్నారు. ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా నా వేషధారణ మార్చలేదని, మన సంప్రదాయ వస్త్రధారణతో ఏ దేశానికి వెళ్లినా అందరూ గౌరవిస్తున్నారని, మన సంప్రదాయాలను మనం పాటిస్తే ప్రపంచం మనం గౌరవిస్తుందని, మన భాషను, మాతృభాషను గొరవించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.