Tirupati Crane Accident: నిర్మాణ పనుల్లో జరిగిన ఓ ప్రమాదం ముగ్గురి ప్రాణాలు తీసింది.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని డీబీఆర్ రోడ్డులో ఓ ప్రైవేట్ హోటల్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భారీ క్రేన్ ఒక్కసారిగా ఒకవైపునకు లోతుగా పడిపోయింది. ఈ ఘటనలో అక్కడే నిర్మాణ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులు క్రేన్ కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం తిరుపతిలోని ఆస్పత్రులకు తరలించారు.. మరోవైపు భారీ క్రేన్‌ను తొలగించేందుకు పోలీసులు, సంబంధిత సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. నిర్మాణ పనుల సమయంలో భారీ యంత్రం ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ విషాదకర పరిస్థితి నెలకొంది.

