Indigo Flight: తిరుపతి విమానాశ్రయంలో శనివారం ఇండిగో విమానానికి ప్రాణాపాయ పరిస్థితి తృటిలో తప్పింది. సాంకేతిక లోపం కారణంగా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సమస్యలు తలెత్తాయి. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి, విమానాన్ని 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించి, చివరికి తిరుపతిలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు.
అయితే విమానం ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయకపోవడంతో వారు విమానాశ్రయంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను ప్రశ్నిస్తూ, తమ గమ్యస్థానానికి వెళ్లే ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా విమానయాన సంస్థలు మరియు పైలట్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. చిన్న సాంకేతిక లోపం కనిపించినా, ప్రయాణికుల భద్రత కోసం పైలట్లు విమానాలను టేకాఫ్ తర్వాత తిరిగి విమానాశ్రయానికి తీసుకువస్తున్నారు.
కేవలం తిరుపతి ఘటన మాత్రమే కాదు, ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. థాయిలాండ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై టేకాఫ్‌ను రద్దు చేశారు. ప్రయాణికుల భద్రత కోసం విమానాన్ని హైదరాబాద్‌లోనే నిలిపివేసి, సాంకేతిక సిబ్బంది సమస్య పరిష్కరించే వరకు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ తరహా సంఘటనలు ప్రయాణికులలో ఆందోళనను పెంచుతున్నాయి. అయితే విమానయాన నిపుణులు మాత్రం, “భద్రతే ప్రథమ ప్రాధాన్యత” అని చెబుతున్నారు. చిన్న లోపం కనిపించినా అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే పెద్ద ప్రమాదాలు నివారించబడుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.
CoinDCX: క్రిప్టో ప్లాట్‌ఫామ్ CoinDCX హ్యాక్.. రూ. 368 కోట్ల నష్టం..
