NTV Telugu Site icon

ఉక్కు మా హక్కు అంటూ విద్యార్ధి గర్జన

విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై యావత్ ఆంధ్రరాష్ట్రం భగ్గుమంటోంది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో విద్యార్ది లోకం రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం కానివ్వబోమని గర్జించారు. విశాఖ ఏవిఎన్ కాలేజ్ నుండి పాత పోస్టాఫీసు వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. పలు విద్యార్ది యూనియన్ లకు చెందిన జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ నిరసన లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జాతీయ కార్యదర్శి మయూక్ బిశ్వాయ్, ఎఐఎస్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి విక్కీ మహేషరీ మాట్లాడుతూ ఆనాడు ఉక్కు ఉద్యమంలో పాల్గొని పదుల సంఖ్యలో విద్యార్దులు ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే ఎంప్లాయ్ మెంట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎటువంటి పరిస్థితులలో ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం కానివ్వబోమని వారు తెలిపారు. స్టీల్ ప్లాంట్ అంశం ఒక్క విశాఖ పట్నంకే పరిమితం కాదని ఇది దేశ సంపద అన్నారు. దీనిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన వుందని సూచించారు. వేల సంఖ్యలో ఉద్యోగులు వున్నప్పటికి లక్షల మంది పరోక్షంగా స్టీల్ ప్లాంట్ వలన జీవనం సాగిస్తున్నారని వివరించారు. ఈ ర్యాలీ లో అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.