Site icon NTV Telugu

Sangameshwara Temple: కృష్ణమ్మ ఒడిలో సంగమేశ్వరుడు.. విశిష్టత ఏంటో తెలుసా?

Sangameshwara Temple Kurnool Krishna Rever Parameshwara (1)

Sangameshwara Temple Kurnool Krishna Rever Parameshwara (1)

కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన సప్తనదీ సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడిలో ఓలలాడుతున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరగడంతో సంగమేశ్వరం క్షేత్రం కృష్ణా జలాల్లో జలకాలడుతోందా అన్నట్టు సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతి ఏటా సంగమేస్వరం వద్ద ఈ సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇంతకీ సప్తనదీ సంగమేశ్వరాలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?

భారత దేశంలోనే 7 నదులు సంగమించే ప్రదేశం సంగమేశ్వరం. అంతే కాదు…. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం సంగమేశ్వరాలయం..వేల సంవత్సరాల చరిత్ర ఉండి …ఎందరో మునులు తపస్సుచేసిన ప్రదేశం సంగమేశ్వరం…కర్నూలు జిల్లాలో నల్లమల ఆటవీక్షేత్రం ఒకవైపు, ఏడు నందుల సంగమించే పవిత్ర ప్రదేశం మరోవైపు…అదే సంగమేశ్వరం క్షేత్రం. భారత దేశంలోనే కాదు….ప్రపంచంలోనే 7 నదులు ఒకచోట కలిసే ప్రదేశం ఎక్కడా లేదు….కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు సంగమించే ప్రదేశమే సంగమేశ్వరం.

ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుష నది, మిగిలినవన్నీ స్ర్రీ నదులు. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి. సంగమేశ్వరాలయానికి చేరుకోవాలంటే కర్నూలు నుంచి ఆత్మకూరు వెళ్లి అక్కడి నుంచి 40 కి.మీ ప్రయాణించాలి. తెలంగాణా ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకుంటారు.

సంగమేశ్వరాయలం ప్రాశస్త్యం ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల కాలంలో గాయత్రీ దేవి గోమాత పాదముద్రలు బహుళ ప్రచారంలోకి వచ్చాయి. క్రిష్ణా నదికి ఒకవైపు తెలంగాణా, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. తెలంగాణాలో సోమేశ్వరం, ఎపిలో సిద్ధేశ్వరం క్రిష్ణ నదికి రెండువైపులా ఉంటాయి. సిద్దేశ్వరానికి, సంగమేశ్వరానికి మధ్యలో గాయత్రిదేవి పాద ముద్రలు ఉన్నాయి. విశ్వామిత్ర మహర్షి గాయత్రి దేవి కోసం సుదీర్ఘ తపస్సు చేశాక గోమాత రూపంలో గాయత్రి దేవి ప్రత్యక్షమైందట. అ సందర్భంలో రాతిపై గోమాత పాదముద్రలు పడ్డాయట. ఇప్పటికీ అక్కడ విశ్వామిత్ర తపస్సు చేసిన గుహ కూడా ఉంది.

ICSE 10th Results: ఐసీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా..
సప్తనదులు సంగమించే ప్రదేశంలో ఉన్న ఆలయమే సంగమేశ్వరాలయం. ఈ ఆలయంలో ఉన్న శివలింగం విశిష్టమైనది…ప్రత్యేకమైనది కుడా. ఈ ఆలయంలో శివలింగం వేప శివలింగం. వేల ఏళ్లక్రితం ధర్మరాజు ప్రతిష్టించిన వేప శివలింగం ఇది. పాండవులు అరణ్యవాసం చేస్తుండగా శ్రీకృష్ణుని సూచన మేరకు ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్టించారు. ఏడు నదులు సంగమించే సంగమేశ్వరంలో శివుని పూజ చేయమని శ్రీకృష్ణుడు చెప్పారట. శివలింగం తీసుకురమ్మని భీమున్ని కాశీకి పంపాడట ధర్మరాజు. ఎంతకీ భీముడు రాకపోవడంతో అమృత గడియలు దాటిపోతాయని అక్కడే ఉన్న వేపచెట్టును నరికి శివలింగంగా మార్చి ప్రతిష్టించి పూజలు చేశారట. కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన భీముడు ఆగ్రహంతో ఊగిపోతూ తాను తెచ్చిన శివలింగాన్ని విసిరేశాడట. ఆ శివలింగం ఇప్పటికీ పగిడ్యాల మండలం బీరవోలు వద్ద ఉంది. భీముని ఆగ్రహానికి అర్థం ఉందని సముదాయించిన ధర్మరాజు మొదట భీమలింగానికే పూజలు చేయాలని చెప్పాడట.

వేల సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం విశేషం. ఏడాదిలో 8 నెలలు నీటిలో మునిగివున్నా చెక్కుచెదరలేదు. ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణంతో ఎక్కువ కాలం నీటిలోనే మునిగిపోతుంది. డ్యామ్ నిర్మాణం తరువాత 23 సంవత్సరాలు నీటిలోనే ఉంది. సంగమేశ్వరాలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ఏడాదిలో 8 నెలలపాటు అంటే జూలై నుంచి మార్చి ఆరంభం వరకు నీటిలోనే ఉంటుంది.

సంగమేశ్వరాలయమే ఇక్కడి ప్రాధాన్యత కాదు. మహా మునులు తపస్సు చేసిన ప్రదేశం కూడా . ఆగస్థ మహాముని, విశ్వామిత్రుడు ఇక్కడ తపస్సు చేశారట. స్కందపురాణంలో సంగమేశ్వరం ప్రాధాన్యత వివరంగా ఉంది. అస్తికలు ఈ నదిలో కలిపినా, పితృదేవతలకు పిండతర్పనం చేసినా ముందు ఏడు జన్మలు, తరువాత ఏడు జన్మల్లో పాపాలు హరిస్తాయట. సంగమేశ్వరంలో స్నానం చేసిన వారికి వెయ్యి రెట్ల ఫలం లభిస్తుందట. సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. సంగమేశ్వరం క్షేత్రంలో గాయత్రి దేవి పాదముద్రలు మరింత భక్తులను ఆకర్షిస్తున్నాయి. గాయత్రి దేవి పాదముద్రల వద్ద సంధ్యావేళ గాయత్రి మంత్రం జపిస్తే సమస్యలు పరిష్కరామవుతాయని వేదపండితులు చెబుతున్నారు. సంగమేశ్వరాలయం దేవాదాయశాఖ పరిధిలోనే ఉంది. ఆదాయం లేదని అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టలేదు దేవాదాయ శాఖ. ఇక్కడ భక్తులకు కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు. కాసిరెడ్డి నాయన ఆశ్రమం నిర్వాహకులు ఇక్కడికి వచ్చే భక్తులకు, పర్యాటకులకు ప్రతి రోజు అన్నదానం చేస్తారు. ఆలయం నీటి వెలుపల ఉండే నాలుగు నెలల కాలంలో కూడా పూజలు చేసేందుకు, భక్తులు వచ్చేందుకు అనేక ఇబ్బందులు ఉన్నాయి.

Exit mobile version