Rajamundry SC ST Atrocity Court Grants 3 Days Bail For Anantha Babu: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు.. మాతృవియోగం కారణంగా 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టుని కోరిన సంగతి తెలిసిందే! దీన్ని విచారించిన రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ ఎట్రాసిటీ కోర్టు.. వాదోపవాదనలు విన్న తర్వాత కొన్ని షరతులతో కూడిన మూడు రోజుల బెయిల్‌కి మంజూరు చేసింది. రూ. 25 వేలను ఇద్దరు జామీనుదారులతో కోర్టుకి సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు.. అనంతబాబుతో నిత్యం పోలీసులు ఉండాలని, అతడు స్వగ్రామం ఎల్లవరం దాటి బయటకు వెళ్లకూడదని చెప్పింది. కేసు విషయం గురించి ఎక్కడా ప్రస్తావించకూడదని, ఇతర విషయాలపై కూడా ఎవరితోనూ చర్చలు జరపకూడదని కండీషన్ పెట్టింది. కేవలం దహన సంస్కారాలకు మాత్రమే బయటకు వెళ్లాలని, 25వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ రైలుకి రావాలని కోర్టు తీర్పునిచ్చింది. అనంతబాబుకి మూడు రోజుల బెయిల్ లభించడంతో.. ఎల్లవరంలో అతని తల్లి మంగారత్నం అంత్యక్రియల్ని ప్రారంభించనున్నారు.
కాగా.. అంతకుముందు కోర్టులో ఈ బెయిల్ పిటీషన్‌పై ఇరు వర్గాల మధ్య జోరుగానే వాదోపవాదనలు సాగాయి. 15 రోజుల పాటు బెయిల్ ఇస్తే.. సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని, కాబట్టి అంత్యక్రియలకి మాత్రమే అనుమతి ఇవ్వాలని సుబ్రహ్మణ్యం కుటుంట సభ్యుల తరఫున లాయర్ వాదించారు. దినకార్యాలు నిర్వహించేందుకు ఒక్కడే కొడుకు కాబట్టి, మానవతా దృక్పథంతో 15 రోజుల బెయిల్ ఇవ్వాలని అనంతబాబు తరఫు లాయర్ వాదిస్తే, కేవలం అంత్యక్రియలకి వెళ్తే సరిపోతుందని బాధిత తరఫు లాయర్ వాదించారు. ఇలాంటి ఘటనలో రెండు రోజులే అనుమతి ఇచ్చిన మద్రాస్ హైకోర్టు తీర్పు కాపీని మెజిస్ట్రేట్ ముందు ఉంచారు. ఈ వాదనలు విన్న తర్వాత.. పై విధంగా షరతులతో కూడిన మూడు రోజుల బెయిల్‌ని కోర్టు మంజూరు చేసింది.
