NTV Telugu Site icon

దేవినేనిపై పలు సెక్షన్ల కింద కేసులు.. మొత్తం 18 మందిపై..!

Devineni Uma

Devineni Uma

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమాపై పలు సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు జి.కొండూరు పోలీసులు.. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధారణకు వెళ్లిన దేవినేని ఉమతో పాటు మొత్తం 18 మందిపై కేసులు పెట్టారు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌తో పాటు 307 కింద హత్యాయత్నం కేసులు పెట్టారు. అర్ధరాత్రి ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు పెదపారపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నందివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఇక, తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమ ఆందోళనకు దిగారు.. సుమారు 6 గంటల పాటు కారులోనే కూర్చొని నిరసన తెలిపారు.. ఆతర్వాత కారు అద్దాలు పగలగొట్టి దేవినేని ఉమాని తమ పోలీస్ వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు పోలీసులు.. రాత్రి దేవినేని ఉమ అరెస్ట్ చేసి పెదపారుపూడి తరలించిన పోలీసులు.. పెదపారుపూడి నుండి నందివాడ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.. టీడీపీ నేతలు వెళ్లిన తర్వాత విడిచిపెట్టారు.. మరోవైపు.. పోలీస్ స్టేషన్లో నేతలను పరామర్శించారు స్థానిక నేతలు.. ప్రస్తుతం పోలీసుల నిర్బంధంలో నందివాడ ఉంది.. గ్రామ సరిహద్దులు నందివాడ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. నందివాడ వెళ్లేందుకు ప్రయత్నించిన తెదేపా నేతలను అడ్డుకున్నారు.