NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: విద్యుత్ తీగల ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

Peddireddy On Atp Incident

Peddireddy On Atp Incident

Peddireddy Ramachandra Reddy: అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విద్యుత్ తీగలు తెగబడి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చిన ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ ద్వారా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, సిఎంఆర్‌ఎఫ్ ద్వారా మరో రూ.5 లక్షలు కలిపి.. మొత్తం రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తామన్నారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశించామని తెలిపారు. సంఘటన జరిగిన పరిధిలోని సబ్ డివిజన్ ఏడీఈ, ఏఈఈ, లైన్ ఇన్స్‌పెక్టర్, లైన్ మెన్‌లపై సస్సెన్షన్ వేటు వేసినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై అనంతపురం ఏఈ, ఈఈల నుంచి వివరణ కోరామన్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి.. సమగ్ర నివేదిక సమర్పించాలని డైరెక్టర్ ఫర్ ఎలక్ట్రికల్ సేఫ్టీ, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్‌కి ఆదేశాలు జారీ చేసినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

మరోవైపు.. ఈ ఘటనపై ఏపీఎస్‌పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కే. సంతోష్ రావు కూడా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఇన్సులేటర్ ఫ్లాష్ అవ్వడంతో కండక్టర్ తెగిపోయి ఈ ప్రమాదం సంభవించిందని అన్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించామని చెప్పారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా.. ఈ ప్రమాదానికి బాధ్యులుగా భావిస్తూ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్. మల్లికార్జున రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంకే లక్ష్మీరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెచ్, హమీదుల్లా బేగ్, లైన్ మ్యాన్ కే బసవరాజులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే.. అనంతపురం సూపరింటెండింగ్ ఇంజనీర్ పీ నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషాద్రి శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే రమేష్‌ల నుంచి వివరణ కోరామన్నారు.

కాగా.. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో కొందరు వ్యవసాయ కూలీలు ఆముదం పంట కోయడానికి ట్రాక్టర్‌లో వెళ్లగా.. విద్యుత్ తీగలు తెగబడి నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యవసాయ కూలీలు పేర్లు.. పార్వతీ, సక్రమ్మ, రత్నమ్మ, వండ్రక్క. క్షతగాత్రుల్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Show comments