Site icon NTV Telugu

Sankranti Brahmotsavams 2026: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల తేదీల ప్రకటన.

Srisailam

Srisailam

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రం సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతుంది.. సంక్రాంతి సమయంలో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. అయితే, శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈనెల 12 నుంచి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు అధికారులు. 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఆలయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి, మహాశివరాత్రి సమయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం దేవస్థానం ఆనవాయితీగా వస్తోంది.

Read Also: 2.8K డిస్‌ప్లే, Dimensity 7300 Max, 12,200mAh బ్యాటరీతో Realme Pad 3 భారత్‌లో లాంచ్‌..!

ఇక, సంక్రాంతి ఉత్సవాలు జనవరి 12న ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ నుంచి మల్లన్న స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు వివిధ వాహన సేవలు నిర్వహిస్తారు. భక్తులకు కనువిందు చేసేలా ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. మకర సంక్రాంతి పర్వదినమైన 15వ తేదీన స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కళ్యాణ మహోత్సవానికి చెంచు గిరిజన భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఆహ్వానం అందించింది. చెంచు సంప్రదాయాలను గౌరవిస్తూ, వారి సమక్షంలో కళ్యాణం జరగడం శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహించే రుద్ర హోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, చండీ–రుద్ర పారాయణం వంటి యాగాలు జనవరి 12 నుంచి 18 వరకు నిరంతరంగా జరుగుతాయి. అయితే, ఉత్సవాల కారణంగా ఈ కాలంలో ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవ, ఏకాంత సేవలు, స్వామి–అమ్మవారి కళ్యాణం, ఇతర ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, 12 నుంచి 18 వరకు రుద్ర, చండి, మృత్యుంజయ, గణపతి హోమాల కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్ నిర్వహణ, అన్నదానం, తాగునీరు, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. పక్కి రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో.. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, దర్శన సమయాల నిర్వహణపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. భక్తులు ముందస్తుగా దర్శనానికి ప్రణాళిక వేసుకుని రావాలని అధికారులు సూచించారు.

Exit mobile version