Heavy Rains: నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో జనజీవనాన్ని స్తంభింపజేశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి చుట్టుపక్కల గ్రామాలకు పెను ముప్పుగా మారింది. ఇక, మహానంది వ్యవసాయ కాలేజీ, వ్యవసాయ ఫారాన్ని వరద నీరు మొత్తం చుట్టుముట్టింది. హాస్టళ్లలోకే వరద నీరు చేరడంతో విద్యార్థులు గదుల్లోనే ఉండిపోయారు. స్టూడెంట్స్ ఆందోళనతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
Read Also: Hydra: గాజులరామారంలో “హైడ్రా” ఆపరేషన్.. 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి..
అలాగే, ఒంగోలు జాతి పశు పరిశోధనా కేంద్రంలోకి కూడా వరద నీరు చేరింది. దాంతో అక్కడున్న ఆవులు ప్రాణభయంతో తల్లడిల్లాయి. అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ సిబ్బంది వాటిని రక్షించేందుకు తగిన చర్యలు చేపట్టారు. ఇక, గాజులపల్లి రహదారిపై వర్షపు నీరు నిల్వ కావడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పాటు మహానంది క్షేత్రానికి విజయవాడ, ఒంగోలు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పోలీసులు మళ్లించారు. గాజులపల్లెలో ఇళ్లలోకీ వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకల పరిసరాలకు ఎవరు వెళ్లొద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
